పుట్టపర్తి: పోస్టల్ బ్యాలెట్ల భద్రత చాలా ముఖ్యం. ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని చిన్నపల్లి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల అధికారుల హాజరు, ఎన్నికల ప్రక్రియ, సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. తాగునీరు, నీడ, వెలుతురు వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. స్ట్రాంగ్ రూం, బ్యాలెట్ బాక్సుల వద్ద పటిష్టమైనభద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట కమిషనర్ శ్రీనివాసులు సిబ్బంది ఉన్నారు.
లోటుపాట్లు ఉండకూడదు
పుట్టపర్తి టౌన్: ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సిబ్బందికి సూచించారు. మంగళవారం పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కదిరి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని బాలికల కళాశాల్లో జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని కలెక్టర్ శ్యాంప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఓటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించి, పోలీస్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఆయన వెంట డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐ బి.వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్ క్రాంతికుమార్, తహసీల్దార్ రెడ్డిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు 31 వరకు గడువు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఓపెన్ టెన్త్ (పదో తరగతి), ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ అయ్యూబ్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రవేశాలు పొందాలనుకునే అర్హులైన అభ్యర్థులు అపరాధ రుసుము చెల్లించకుండా ఈ నెల 31వ తేదీలోగా తమ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. చదువును మధ్యలో నిలిపివేసినవారు, ఇతర అర్హతలు కలిగి ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 97042 22436 నంబర్‌ను సంప్రదించాలని డీఈఓ సూచించారు.


