సరిహద్దులో భద్రత కట్టుదిట్టం | - | Sakshi
Sakshi News home page

సరిహద్దులో భద్రత కట్టుదిట్టం

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

● కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌,

ఎస్పీ సతీష్‌కుమార్‌ వెల్లడి

ప్రశాంతి నిలయం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొరుగున ఉన్న కర్ణాటక సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌, ఎస్పీ సతీష్‌కుమార్‌ వెల్లడించారు. శనివారం సాయంత్రం వారు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఏఎస్పీ అంకిత సురానాతో కలిసి స్థానిక ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల గురించి కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపురం జిల్లాల పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అంతర్రాష్ట్ర సరిహద్దు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఎస్పీ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ... జిల్లాకు 384 కిలోమీటర్లు మేర అంతర్రాష్ట్ర సరిహద్దు ఉందని, ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు. డబ్బు, మద్యం అక్రమ రవాణాకు పూర్తి అడ్డుకట్ట వేస్తామన్నారు. అలాగే రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులు, ఆసాంఘిక శక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సహకారం అందించాలని కర్ణాటక రాష్ట్ర పోలీసు అధికారులను కోరారు. రెండు రాష్ట్రాల పోలీస్‌ అధికారుల మధ్య సమన్వయం కోసం నోడల్‌ అధికారులను నియమించడంతో పాటు వాట్సాప్‌ గ్రూపులు, కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని మార్పిడి జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌, ఎస్పీ తెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా

పెనుకొండ రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు ఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన పట్టణంలోని నామినేషన్ల పరిశీలన కేంద్రాన్ని సందర్శించారు. విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement