రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

పరిగి: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెచ్‌ఎం కృపాసత్యరాజు శనివారం తెలిపారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల కదిరిలో జరిగిన పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు మంజుల, గంగమ్మ, వర్షిత, సుహాన్‌, రాజు, రామ్‌చరణ్‌, అఖిలేష్‌ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. ఇందులో మంజుల జాతీయ స్థాయి ప్రాబబుల్స్‌కు ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థులను హెచ్‌ఎం, పీడీ వినోద్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

స్థానిక ఎన్నికలకు

పటిష్ట బందోబస్తు

చిలమత్తూరు: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. ఎంపీటీసీ నామినేషన్‌ల పరిశీలన నేపథ్యంలో ఆయన శనివారం ఆయన చిలమత్తూరు, లేపాక్షి నామినేషన్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ నామినేషన్‌లు ప్రశాంతంగా జరిగాయన్నారు. పరిశీలన కూడా సాఫీగా సాగిందని తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో 255 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. నామినేషన్‌ కేంద్రాలకు 100 మీటర్ల వరకూ మీడియాను అనుమతించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆంక్షలు విధించవద్దని స్థానిక పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రవిబాబు, సీఐ జనార్దన్‌, ఎస్‌ఐలు శ్రీధర్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో నియంత పాలన

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో చంద్రబాబు ప్రభుత్వం నియంతగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ప్రవర్తించాలో తెలియదా అని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా స్థానిక ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. విపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, దాడులు చేయడం, పత్రాలను బలవంతంగా లాక్కుని చింపివేయడమే టీడీపీ విధానమా అని నిలదీశారు. గుత్తి, గుంతకల్లు తదితర నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. గోరంట్లలో మంత్రి అనుచరులు సాక్షాత్తూ ఎన్నికల అధికారి చేతిలో నుంచే నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేసినా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గుంతకల్లు నామినేషన్‌ కేంద్రాల వద్ద రౌడీలు, గూండాలు అరాచకాలు సృష్టిస్తుంటే అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

పోలీసు, అధికార యంత్రాంగం వైఫల్యం

టీడీపీ గూండాలు బహిరంగంగా దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement