అనంతపురం: యువత సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టాలని జేఎన్‌టీయూ(అనంతపురం) వైస్ చాన్సలర్ డాక్టర్ హెచ్.సుదర్శనరావు సూచించారు. జేఎన్‌టీయూఏ వేదికగా విస్తార విద్యానిధి ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఇన్నోవేటర్స్ కాన్‌క్లేవ్–2026 శనివారం వర్సిటీ ఆడిటోరియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, స్టార్టప్‌లకు సరికొత్త అవకాశాలు, విద్యాసంస్థలు–పరిశ్రమల మధ్య అనుసంధానానికి బలమైన వేదికగా జేఎన్‌టీయూఏ నిలుస్తోందన్నారు. దేశంలోని విద్యా, సాంకేతిక సంస్థలు, పరిశ్రమలు, అంకుర సంస్థలకు చెందిన ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ సదస్సుకు మూడు వేల మందికి పైగా విద్యార్థులు, 300కు పైగా స్టార్టప్‌ల ప్రతినిధులు, 80 మందికి పైగా పరిశ్రమల ప్రముఖులు హాజరు కావడం గొప్ప విషయమన్నారు. ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పరిశోధనలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మలచడం, యువతలో వ్యవస్థాపక దృక్పథాన్ని పెంపొందించడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కాన్‌క్లేవ్ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే రాయలసీమ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్కేయూ వీసీ డాక్టర్ ఎన్‌వీఆర్ జ్యోతి కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఏ చౌదరి, యాక్సెంచర్ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ పింగళి, టాటా ఏఐజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలు విజయ దీప్తి, ఐఈఈఈ ఇండియా కంట్రీ హెడ్ అండ్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ చంద్రశేఖరన్, ఈథర్‌వింగ్ ఏరోస్పేస్ సీఈఓ మానేగార్ శర్మాస్ వలి తదితరులు పాల్గొన్నారు. కాన్‌క్లేవ్ తొలిరోజు సుస్థిర ఆవిష్కరణలు, సంస్థల నిర్మాణం, వ్యూహాత్మక సాంకేతికతలు, జాతీయ భద్రత, దేశ సాంకేతిక స్వావలంబన వంటి కీలక అంశాలపై చర్చలు జరిపారు. రెండో రోజు ఆదివారం జాతీయ ప్రగతిలో ఆవిష్కరణల పాత్ర, స్టార్టప్ ఇంక్యుబేషన్, నిధుల సమీకరణ, సాంకేతికత–చట్టం–పరిపాలన వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), సైబర్ భద్రత, భవిష్యత్ సాంకేతికతలపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
ఇన్నోవేటర్స్ కాన్‌క్లేవ్‌లో
జేఎన్‌టీయూఏ వీసీ సుదర్శనరావు
హాజరైన 3వేల మందికి పైగా
విద్యార్థులు, 300కు పైగా
స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు


