ధర్మవరం: పరిషత్ ఎన్నికల నామినేషన్‌ల సందర్భంగా వరుసగా రెండోరోజు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం వన్‌టౌన్ సీఐ రెడ్డప్ప తన సిబ్బందితో కలిసి వచ్చి కేతిరెడ్డిని బయటకు రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఎన్నికలను న్యాయబద్ధంగా ఎదుర్కోవాలే గానీ, పోటీ చేయనీయకుండా చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చాలా దారుణమన్నారు. కూటమి పాలకులు చేస్తున్న దౌర్జన్యాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కూటమి మూకల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్ట్‌లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. న్యాయం కోసం ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఇప్పటికే తాడిమర్రిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్లదాడి చేసి నామినేషన్లు వేయనీయకుండా దౌర్జన్యం చేశారని, అడ్డుకోవాల్సిన పోలీసులు... కూటమి నాయకులకు వంత పాడుతూ ఏకంగా వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లలోకి వెళ్లి మహిళలను, పిల్లలను భయభ్రాంతులకు గురి చేయడాన్ని అందరూ గమనిస్తున్నారన్నారు. బత్తలపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని పోలీసులు యత్నిస్తే ఏకంగా డీఎస్పీ, సీఐల మీద కూటమి నాయకులు రాళ్లదాడి చేసి వాహనాలను ధ్వసం చేయడం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అలానే ముదిగుబ్బ మండలంలో సైతం టీడీపీ మూకలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై చేస్తున్న దౌర్జన్యం అన్నీ గమనిస్తున్నామన్నారు. వీటన్నింటికి పదింతల మూల్యం చెల్లించుకోక తప్పదని కూటమి నాయకులకు కేతిరెడ్డి హెచ్చరించారు.
కూటమి నేతలు, కార్యకర్తలను
హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
రెండోరోజూ ఆయన్ను
గృహ నిర్బంధం చేసిన పోలీసులు


