కలెక్టరేట్‌ ఎదుట తోపుదుర్తి ధర్నా | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట తోపుదుర్తి ధర్నా

Oct 23 2026 1:39 AM | Updated on Oct 23 2026 1:39 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యాలు జరుగుతున్నా అడ్డుకోవడం లేదని విమర్శించారు. నామినేషన్లకు అడ్డంకులు, దాడులకు నిరసనగా గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 81 ఎంపీటీసీ స్థానాలుండగా తొలిరోజు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు చేయనీయలేదన్నారు. కనగానపల్లిలో కొడవళ్లు, కర్రలతో వీరంగం సృష్టించారని, ఎస్‌ఐ వాహనాన్ని పల్టీలు కొట్టించారని పేర్కొన్నారు. అనంతపురం రూరల్‌ ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులపై దాడులు జరిగాయన్నారు. రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఆత్మకూరులో 11 మంది ఎంపీటీసీ అభ్యర్థులను పోలీసులకు అప్పగించినా నామినేషన్లు వేయించలేదని విమర్శించారు. రాప్తాడులో 1995 నాటి దౌర్జన్యపూరిత ఎన్నికల పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని, పరిటాల కుటుంబం కిరాయి మూకలను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోందని మండిపడ్డారు. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రెండు జిల్లాల కలెక్టర్లు, ఐజీ, ఎస్పీలు జోక్యం చేసుకుని చివరి రోజైనా తమ పార్టీ అభ్యర్థులందరికీ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement