పోలీసులపైనే రాళ్ల దాడి | - | Sakshi
Sakshi News home page

పోలీసులపైనే రాళ్ల దాడి

Oct 23 2026 1:39 AM | Updated on Oct 23 2026 1:39 AM

ధర్మవరం: పరిషత్‌ ఎన్నికల పర్వంలో పచ్చ గూండాల ఆగడాలకు, దౌర్జన్యాలు, దాడులకు అంతేలేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు చివరకు పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నారు. ఎంపీటీసీ నామినేషన్ల రెండోరోజు గురువారం బత్తలపల్లిలో పోలీసులపై కూటమి నేతల రాళ్ల దాడులతో జనం భయాందోళనలు చెందారు.

సీఐ వాహనంపై రాళ్లదాడి..

ఎంపీటీసీ నామినేషన్లలో తొలిరోజు బుధవారం కూటమి పార్టీల నాయకులు నామినేషన్‌ కేంద్రాన్ని ఆక్రమించారు. పథకం ప్రకారమే హెల్త్‌డెస్క్‌లో తిష్టవేసి అక్కడే ఉన్నారు. పోలీసులు కూడా కూటమి పార్టీల నాయకుల నామినేషన్ల తర్వాత వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామంటూ ఆ రోజంతా వృథా చేశారు. దీంతో రెండోరోజు గురువారం నామినేషన్‌ వేయడానికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు సిద్ధం కాగా, టీడీపీ వర్గీయులు తొలిరోజులాగే నామినేషన్‌ పత్రాలతో హెల్ప్‌డెస్క్‌ వద్ద హడావుడి చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎంపీటీసీ అభ్యర్థులు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తమతో నామినేషన్‌ వేయించాలని కోరారు. దీంతో సీఐ ప్రభాకర్‌గౌడు నామినేషన్‌ వేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తన వాహనంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎక్కించుకుని నామినేషన్‌ కేంద్రానికి బయలుదేరారు. ఈ సమాచారం తెలుసుకున్న కూటమి నేతలు టీడీపీ కార్యాలయం ఎదుట సీఐ వాహనాన్ని అడ్డుకొని రాళ్లు, కట్టెలు, బీరు సీసాలతో దాడులు చేశారు. ఇంతలో సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు అక్కడికి చేరుకుని సీఐ వాహనాన్ని పంపించారు. అనంతరం కూటమి నేతలు దాడులు చేస్తుండడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. కూటమి నాయకులు కూడా వారిపై దాడులు చేయడంతో సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఓబులేసు, సాయిగిరీష్‌లతో పాటు సీఐ వాహన డ్రైవర్‌ రాజు, మరో కానిస్టేబుల్‌ గాయపడ్డారు. చివరకు బత్తలపల్లి–1 ఎంపీటీసీ స్థానానికి మాతంగి కాటమయ్య, బత్తలపల్లి–2 స్థానానికి కొత్తకోట షంషాద్‌, బత్తలపల్లి–3 ఎంపీటీసీ స్థానానికి కోళ్లమొర్రం సుమతి, మాల్యవంతం ఎంపీటీసీ స్థానానికి దామోదర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.

బత్తలపల్లి కూడలిలో కూటమి నేతల హల్‌చల్‌

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో నామినేషన్‌ వేయించడాన్ని జీర్ణించుకోలేని కూటమి నేతలు బత్తలపల్లి కూడలిలో నిరసనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో వచ్చిన ధర్మవరం డీఎస్పీ జగన్నాథరాజు వాహనంపైనా రాళ్లతో దాడి చేశారు. ఓ టీడీపీ కార్యకర్త పోలీసుల లాఠీనే తీసుకుని దాడులు కొనసాగించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ నేతృత్వంలో వారు రెచ్చిపోయారు.

బత్తలపల్లిలో బరితెగించిన

కూటమి గూండాలు

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులతో నామినేషన్‌ వేయించేందుకు పోలీసుల ప్రయత్నం

సీఐ వాహనాన్ని అడ్డగించి రాళ్లు, కట్టెలు, బీరు సీసాలతో దాడులు

రాళ్ల దాడిలో పలువురికి గాయాలు, డీఎస్పీ, సీఐల వాహనాల ధ్వంసం

భయాందోళనకు గురైన ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement