పెనుకొండ రూరల్: ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతలు దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. గురువారం ఆమె స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతలు కరువయ్యాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, కానీ కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నామినేషన్లు కూడా వేయకుండా ఎక్కడికక్కడ దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ మూకలను కట్టడి చేయాల్సిన పోలీసులు కూడా ప్రేక్షకుల్లా చూస్తున్నారన్నారు. ముఖ్యంగా మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గోరంట్లలో ఆర్‌ఓ చేతుల్లోని వైఎస్సార్ సీపీ మహిళా అభ్యర్థి నామినేషన్ పత్రాలను ఓ టీడీపీ నాయకుడు సీఐ శేఖర్, పోలీసుల సమక్షంలోనే లాక్కోవడం చూస్తే పోలీసింగ్ ఎలా పనిచేస్తుందో అర్థమవుతోందన్నారు. టీడీపీకి చెందిన సుబ్బారెడ్డిని ఆర్‌ఓ కార్యాలయంలోనికి వదలాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం పోలీసుశాఖపై ఉందన్నారు. అలాగే రెడ్డి చెరువుపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఆనంద్ నామినేషన్ దాఖాలు చేసేందుకు వెళ్తుండగా, టీడీపీకి చెందిన నాగేనాయక్ అడ్డుకుని నామినేషన్ పత్రాలు చించి వేశారన్నారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. అలాగే పెనుకొండ మండలం మునిమడుగు పంచాయతీకి చెందిన కిష్టప్ప తన అభ్యర్థులతో నామినేషన్ వేయించేందుకు వెళ్తుండగా అదే పంచాయతీకి చెందిన మల్లికార్జున, వాసుదేవరెడ్డి వారిని అడ్డుకొని నామినేషన్ పత్రాలు లాక్కున్నారన్నారు. కురుబవాండ్లపల్లికి చెందిన ఓబులప్ప అనే దళితుడిని నానా దుర్భాషలాడుతూ దాడి చేసి నామినేషన్ పత్రాలు లాక్కోడం చూస్తే రౌడీల రాజ్యం నడుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ గూండాలను మంత్రి సవిత ప్రోత్సహిస్తున్నారన్నారు. టీడీపీ నేతల బరితెగింపు వీడియోలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో అందరికీ అర్థమవుతోందన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, టీడీపీ గుండాల దాష్టీకాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంపై గౌరవంతో
దాడులు చేస్తున్నా సహిస్తున్నాం
మంత్రి ఇలాకాలో మహిళా అభ్యర్థులపై దౌర్జన్యాలు పెరిగాయి
దళితులపై దాడులు జరుగుతున్నా...
అధికారులకు పట్టడం లేదు
ఆర్‌ఓ చేతుల్లోని నామినేషన్ పత్రాలు లాక్కొని చించినా చర్యలు లేవు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్ మండిపాటు
‘‘ప్రజాస్వామ్యంపై మాకు అపార గౌరవం ఉంది. అందువల్లే మా నాయకులు,
కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా సహిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగానే వాటిని ఎదుర్కొంటున్నాం. టీడీపీ గూండాలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, మందీమార్బలం మాకూ ఉంది. కానీ చట్టాన్ని గౌరవించి నడుచుకుంటున్నాం. ఇది మా చేతగాని తనం అనుకోవద్దు.. మా సహనం నశిస్తే మీకే నష్టం’’


