స్థానిక సంస్థల ఎన్నికల్లో యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. టీడీపీ అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. కళ్యాణదుర్గంలో ఓ కౌన్సిలర్ అభ్యర్థి ఓటర్లను ప్రలోభపెట్టేలా బోరుబావి తవ్వించాడు. ఇక ఓ ఎంపీటీసీ అభ్యర్థి ఏకంగా టీడీపీ నేతల గుంపుతో నామినేషన్ వేయడం విశేషం. అనంతపురంలో మెప్మా ఆర్పీ ఏకంగా పసుపు కండువా కప్పుకుని టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించడం గమనార్హం.
● టీడీపీ అభ్యర్థుల ఇష్టారాజ్యం
● పట్టించుకోని పోలీసులు, ఎన్నికల అధికారులు
అనంతపురంలో టీడీపీ కండువాతో ప్రచారం చేస్తున్న మెప్మా ఆర్‌పీ పద్మ
కళ్యాణదుర్గం 28 వార్డులో బోరు డ్రిల్లింగ్‌ను పరిశీలిస్తున్న టీడీపీ నేతలు
కళ్యాణదుర్గం: మున్సిపల్ ఎన్నికలలో గెలుపు కోసం టీడీపీ కూటమి 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గెల్లీ వెంకట కార్తీక్ (చింతపండు కార్తీక్) నానా తంటాలు పడుతున్నారు. గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు బోరు డ్రిల్లింగ్ చేయిస్తూ ప్రలోభాలకు గురి చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండన్నరేళ్లు అవుతున్నా తాగునీటి సమస్యను పరిష్కరించకుండా పట్టించుకోని నేతలు మున్సిపల్ ఎన్నికల వేళ ఆర్భాటంగా బోర్లు తవ్వించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కేవలం ఓట్ల కోసం ఇలా చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించినా ఎన్నికల అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి స్వయానా బోర్లు తవ్విస్తున్నారని తెలిసినా టీడీపీ నేతలు మాత్రం స్థానిక కాలనీవాసులే సొంత డబ్బుతో బోర్లు డ్రిల్లింగ్ చేయిస్తున్నారని చెప్పడం గమనార్హం. ప్రలోభాలకు తెర లేపుతున్న అభ్యర్థులపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
టీడీపీ తరఫున
మెప్మా ఆర్‌పీ ప్రచారం
అనంతపురం: మెప్మాలో ఆర్‌పీ (రీసోర్స్ పర్సన్)గా పని చేస్తున్న పద్మ అనే మహిళ టీడీపీ కండువా ధరించి ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ వేతనం, గౌరవ వేతనం పొందే సిబ్బంది ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకీ మద్దతుగా ప్రచారం చేయకూడదు. అయితే 19వ డివిజన్‌లోని రహమత్‌నగర్, బాబానగర్‌లో పద్మ ప్రచారం చేశారు. ఎన్నికల అధికారులు ఆమైపె చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


