సాక్షి, పుట్టపర్తి/కనగానపల్లి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి దిగితే ఓడిపోతామని తెలుసుకున్న ‘పచ్చ’పార్టీ నేతలు బలవంతంగా ఏకగ్రీవం చేసుకోవాలనే ఉద్దేశంతో రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. గూండాల్లా మారి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా.. రాప్తాడు నియోజకవర్గంలో మరింత దారుణంగా తయారైంది. పరిటాల కుటుంబం డైరెక్షన్‌లో నియోజకవర్గ వ్యాప్తంగా వారి అనుచరులు బరి తెగించారు. ఇతర ప్రాంతాల నుంచి రౌడీలను తీసుకొచ్చి.. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారు. ఇనుప రాడ్లతో భౌతికదాడులకు దిగి వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. టీడీపీ గూండాల దౌర్జన్యాలను చూసి కూడా పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పైగా వైఎస్సార్ సీపీ నాయకులపైనే ఆంక్షలు విధిస్తున్నారు. చివరకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్ కేంద్రాల్లోకి కూడా వెళ్లకుండా ఎక్కడికక్కడ వారిస్తున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ వేయడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే అనంతపురం రూరల్, ఆత్మకూరు, కనగానపల్లి, రామగిరి మండలాల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కానీ టీడీపీ తరఫున నామినేషన్ల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది.
కనగానపల్లిలో కాపుకాచి...
దాడిచేసిన పచ్చమూకలు
ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులపై పరిటాల అనుచరులు.. టీడీపీ గూండాలు రాళ్లదాడులు చేశారు. కనగానపల్లి గ్రామంలో నుంచి స్థానిక ఎంపీడీఓ కేంద్రానికి నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వారిపై ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో కాపుకాచి దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంకె లక్ష్మన్నతో పాటు వేపకుంట గ్రామానికి చెందిన దివిటి సోమశేఖర్, గడ్డం నారాయణ, కాటేరి ముత్యాలు, కట్టెల రామలింగ, హరిజన హనుమంతు, ముత్తువకుంట్ల రామకృష్టతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అదేవిధంగా రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పాటు నరసంపల్లి నుంచి కనగానపల్లికి వాహనాల్లో వస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కూడా టీడీపీ నాయకులు అడ్డుకొని దాడి చేశారు. ఈక్రమంలోనే గురువారం రెండోరోజు కనగానపల్లిలో వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
రాప్తాడులో రాళ్లదాడి
నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో కూడా నామినేషన్లు వేసేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై ఎంపీడీఓ కార్యాలయం ముందే పచ్చమూకలు రాళ్ల దాడి చేశాయి. పోలీసుల ముందే దాడులు జరుగుతున్నా వారు అడ్డుకోలేకపోవటంతో రెండో రోజు నామినేషన్లు వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఒక్కరూ కూడా నామినేషన్ వేయకుండానే అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో పాటు ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాల్లో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. దీంతో రాప్తాడు నియోజవర్గవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక జెడ్పీటీసీ స్థానానికి, 10 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారు.
రామగిరిని చుట్టుముట్టిన రౌడీలు
ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలం రామగిరిలో వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రెండు రోజులుగా టీడీపీ గూండాలు రామగిరి మండల కేంద్రంలో హల్‌చల్ చేస్తున్నారు. దీనికి తోడు అటు వైపు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వెళ్లనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే రామగిరి మండలంలో వైఎస్సార్ సీపీ నేతలు ఒక్క నామినేషన్ కూడా వేయలేకపోయారు. గతంలో ఎంపీపీ ఉప ఎన్నిక సమయంలో టీడీపీ గూండాల చేతిలో కురుబ లింగమయ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఎలాంటి దారుణాలకు ఒడిగడతారోనని ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు.
సీకే పల్లిలో ‘పరిటాల’ హైడ్రామా
చెన్నేకొత్తపల్లిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సరికొత్త డ్రామాకు తెరదీశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో ఎందుకు నామినేషన్ వేయించారంటూ అధికారులను ప్రశ్నిస్తూ ధర్నాకు దిగారు. గురువారం చెన్నేకొత్తపల్లి మండలంలోని వివిధ ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీకి చెందిన 11 మంది నామినేషన్లు వేశారు. దీంతో పోలీసులు, అధికారులను బెదిరిస్తూ పరిటాల సునీత, ఎంఎస్ రాజు నిరసనకు దిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా విధులు నిర్వర్తించిన పోలీసుల చర్యలను ఖండించారు. ‘సీఐ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో కనిపించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. అంతకుముందు ఎస్‌ఐ సత్యనారాయణ ఏకపక్షంగా వ్యవహరిస్తూ నామినేషన్ వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బెదిరిస్తూ వెనక్కు పంపడం చర్చనీయాంశమైంది.
ఆత్మకూరులో తమ్ముళ్ల అరాచకం
ఆత్మకూరు మండలానికి సంబంధించి ఎంపీటీసీలుగా పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని వడ్డిపల్లి వద్ద అడ్డుకున్నారు. మండల కేంద్రంలో సుమారు వెయ్యి మంది టీడీపీ గూండాలు మోహరించారు. కట్టెలు, రాళ్లు, రాడ్లతో నిల్చుని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో బుధ, గురువారాల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఏ ఒక్కరూ నామినేషన్ వేయలేకపోయారు.
నామినేషన్ల చించివేత
అనంతపురం రూరల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పచ్చ రౌడీలు రాళ్లు, ఇటుకపెళ్లలతో దాడి చేయడంతో కొడిమి గ్రామానికి చెందిన మాజీ డీలర్ రాముడు తలకు బలమైన గాయాలయ్యాయి. అలాగే కొందరు అభ్యర్థుల నామినేషన్లను లాక్కుని చింపేశారు. రాప్తాడులోనూ రాళ్ల వర్షం కురిపించారు. సాక్షి టీవీ రిపోర్టర్ మురళీపై దాడికి తెగబడ్డారు.
నియోజకవర్గ వ్యాప్తంగా నిల్
రాప్తాడు నియోజకవర్గంలో ఆరు మండలాలకు గానూ చెన్నేకొత్తపల్లి మినహా ఏ మండలంలోనూ వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ దాఖలు కాలేదు. అనంతపురం రూరల్‌తో పాటు రాప్తాడు, ఆత్మకూరులో టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. దీనికి తోడు పోలీసులు కూడా టీడీపీ గూండాలను వదిలేసి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలనే అడ్డుకోవడంతో నామినేషన్ దాఖలు చేయలేని పరిస్థితి నెలకొంది.
నామినేషన్‌కు వెళ్లకుండా
టీడీపీ గూండాల అడ్డగింత
రామగిరిలో ముందస్తుగా
మోహరించిన రౌడీ మూకలు
కనగానపల్లి మండలంలో
పరిటాల అనుచరుల బరితెగింపు
వైఎస్సార్‌సీపీ నాయకులు,
కార్యకర్తలే లక్ష్యంగా భౌతికదాడులు
దాడుల్లో తీవ్రంగా గాయపడిన
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు
రామగిరి, కనగానపల్లిలో నామినేషన్ వేయలేని స్థితిలో వైఎస్సార్‌సీపీ
ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులు.. పట్టించుకోని అధికారులు


