● మరొకరికి తీవ్రగాయాలు..
గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రెండు ద్విచక్రవాహనాలు పరస్పరం ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలయ్యారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని జక్కలచెరువు గ్రామానికి చెందిన సులోచన(32) బొమ్మనహాళ్ మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన తన సోదరుడు మహేంద్ర, మేనకోడలు శ్రీలక్ష్మిలతో కలిసి సరుకుల కొనుగోలుకు గుత్తికి బయలుదేరారు. అయితే కొత్తపేట గ్రామ శివారులోని శ్రీకృష్ణ మందిరం వద్ద గుత్తి నుంచి తాడిపత్రి వైపునకు వెళ్తున్న నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజుల గ్రామానికి చెందిన రంగస్వామి ద్విచక్రవాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో సులోచన, రంగస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీలక్ష్మి, మహేంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సులోచన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. రంగస్వామిని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


