మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హౌస్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హౌస్‌ అరెస్ట్‌

Oct 22 2026 1:15 AM | Updated on Oct 22 2026 1:15 AM

ధర్మవరం: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పట్టణ పోలీసులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. తాడిమర్రి, ముదిగుబ్బ, బత్తలపల్లి మండలాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరుగుతున్న దౌర్జన్యాలను ప్రశ్నించేందుకు కేతిరెడ్డి సిద్ధమవుతుండగా... పట్టణ సీఐ రెడ్డప్ప, టూటౌన్‌ సీఐ జయానాయక్‌ తమ సిబ్బందితో కలిసి వచ్చి ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. దీంతో కేతిరెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనకు కూడా అవకాశం ఇవ్వరా..? అని ప్రశ్నించారు. అనంతరం డీఎస్పీ జగన్నాథరాజుతో ఫోన్‌లో మాట్లాడారు. తనను బయటకు పంపాలని విజ్ఞప్తి చేసినప్పటికీ పోలీసులు స్పందించక పోవడం దారుణమని కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తే తాము బయటకు వెళ్లే పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.

అభ్యర్థులకు ఇబ్బందులు కలగనీయొద్దు

పుట్టపర్తి: నామినేషన్‌ వేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జేసీ మౌర్య భరద్వాజ్‌తో కలిసి కొత్తచెరువులో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ నామినేషన్‌ కేంద్రాన్ని సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, భద్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలన్నారు. కేంద్రాల వద్ద పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని, రిటర్నింగ్‌ అధికారులు అప్రమత్తంగా ఉండి నిబంధనల ప్రకారం నామినేషన్లు స్వీకరించాలని సూచించారు.

మద్యం బంద్‌..

విద్యాసంస్థలకు సెలవు

●ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్‌

శ్యాం ప్రసాద్‌ ఆదేశం

● ఈ నెల 26 నుంచి 28 వరకు మద్యం దుకాణాల మూసివేత

ప్రశాంతి నిలయం: మున్సిపల్‌ ఎన్నికలు ప్రాంతాల్లో ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ సాయంత్రం వరకూ మూడు రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. దీంతో పుట్టపర్తి, కదిరి, హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, మడకశిర మున్సిపాలిటీల పరిధిలోని మద్యం దుకాణాలన్నీ మూతపడనున్నాయి.

పాఠశాలలు, కళాశాలలకు సెలవులు

ఈ నెల 28న మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్ల కోసం పాఠశాలల, కళాశాలలను వినియోగిస్తున్న నేపథ్యంలో ఆయా విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 28న పోలింగ్‌ జరగనుండడంతో ముందు రోజు 27వ తేదీ నుంచే సెలవు ఇచ్చారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లోని విద్యాసంస్థలు ఈనెల 31వ తేదీన తెరచుకోనున్నాయి.

అధికారులకు పోస్టల్‌ బ్యాలెట్లు

మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ ఈనెల 24వ తేదీనే

పోస్టల్‌ బ్యాలెట్లు అందజేస్తామని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్లను సంబంధిత మున్సిపాలిటీల ద్వారా పొంది ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement