బేరాల భరోసా! | - | Sakshi
Sakshi News home page

బేరాల భరోసా!

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

పుట్టపర్తి అర్బన్‌:

50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..రెండేళ్లుగా ఆ విషయమే మరచిపోయారు. తీరా స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓట్లు రాబట్టేందుకు పింఛన్‌ రాగం అందుకున్నారు. వారం గడువు విధించి దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అర్హులంతా ఆశగా సచివాలయాల వద్దకు వెళ్లగా...అక్కడ తిష్టవేసిన కూటమి పార్టీల నేతలు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ కోసం బేరాలు పెట్టారు. అర్హత అక్కర లేదని, తాము అడిగినంత ఇస్తే పింఛన్‌ మంజూరు చేయిస్తామంటూ భారీగా వసూళ్లు చేశారు.

సదరం సర్టిఫికెట్‌ పేరుతో దోపిడీ..

పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించగానే కూటమి నాయకులు రంగంలోకి దిగారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసుకొని భారీగా డబ్బు వసూలు చేయడానికి శ్రీకారం చుట్టారు. పింఛన్‌ దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్‌ అవసరం కానుండగా.. వారి నుంచి ఒక్కో సదరం సర్టిఫికెట్‌ కోసం రూ.30 వేల నుంచి రూ. 40 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా పెనుకొండ ఆస్పత్రి నుంచి సర్టిఫికెట్లు తీసుకునేందుకు టీడీపీ నాయకులు ఓ హోటల్‌లో మకాం వేసి రూ.లక్షల్లో వసూళ్లు చేశారు.

సచివాలయ సిబ్బందిపై పెత్తనం..

అన్ని అర్హతలున్న వారి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేద్దామనుకున్న సచివాలయ సిబ్బందిపై కూడా ‘తెలుగు తమ్ముళ్లు’ పెత్తనం చేశారు. సచివాలయాల్లోనే తిష్టవేసి తాము చెప్పిన వారి దరఖాస్తులే తీసుకోవాలంటూ హుకూం జారీ చేశారు. మరికొందరు నేతలు వేళాపాలా లేకుండా, మహిళలని కూడా చూడకుండా ఫోన్లు చేస్తూ సచివాలయ సిబ్బందిని వేధించారు. పోనీ వారు చెప్పిన వారి దరఖాస్తులే ఆన్‌లైన్‌ చేద్దామంటే యాప్‌ పనిచేయక డిజిటల్‌ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మాట మార్చిన చంద్రబాబు..

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే సామాజిక పింఛన్‌ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారు. రెండేళ్లుగా సామాజిక పింఛన్ల ఊసే ఎత్తని ఆయన..తాజాగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పినా...60 ఏళ్లు దాటిన వారి నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించడంతో ఆయా వర్గాల వారు చంద్రబాబుపై ఆగ్రహంతో ఊగి పోతున్నారు.

భారీగా దరఖాస్తులు..

వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, డప్పు కళాకారులు, కల్లుగీత కార్మికులు తదితరులు కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 32 మండలాల నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ 54,521 మంది దరఖాస్తు చేసుకున్నట్లు జీఎస్‌డబ్ల్యూఎస్‌ అధికారి శ్రీలక్ష్మి పేర్కొన్నారు.

జగన్‌ హయాంలో అర్హతే ప్రామాణికం..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేశారు. ఈ క్రమంలోనే కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్‌ మంజూరు చేశారు. ఐదేళ్ల కాలంలో జిల్లాలో 42 వేలకుపైగా పింఛన్‌లను పెంచి అందజేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్లు లబ్ధిదారులు నిద్ర లేవక ముందే తలుపుతట్టి మరీ పింఛన్‌ మొత్తాన్ని అందజేశారు. పింఛన్‌ లబ్ధిదారుల్లో ఎవరైనా అనారోగ్యంతో లేదా ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా...వలంటీర్లు వారి వద్దకే వెళ్లి పింఛన్‌ మొత్తం అందించి వారికి భరోసా కల్పించారు. ఇక కొందరు పింఛన్‌దారులు వివిధ సమస్యలతో ఇతర రాష్ట్రాల్లో ఉన్నా... అక్కడికే వెళ్లి పింఛన్‌ మొత్తాన్ని అందజేశారు. ప్రతి ఆరు నెలలకూ ఓ సారి అర్హులు ఎవరున్నా అర్హతే ప్రమాణికంగా పింఛన్లు మంజూరు చేసి ఆదుకున్నారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు వైఎస్‌ జగన్‌ను, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలను మరవ లేకున్నారు.

పింఛన్‌ అంటే

అంత తేలిక కాదు..

కొంచెం

ఖర్చవుతుంది..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement