ప్రశాంతి నిలయం: మానవాళి శ్రేయస్సే లక్ష్యంగా సత్యసాయి అందించిన ఆధ్యాత్మిక, మానవతా విలువలతో కూడిన జ్ఞానం భవిష్యత్ తరాలకు బదిలీ చేసే చక్కటి వ్యవస్థను రూపొందించే లక్ష్యంతో యువత ముందుకు సాగాలని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌రాజు పిలుపునిచ్చారు. విలువలతో కూడిన విద్యను గ్రామస్థాయి వరకూ చేర్చే లక్ష్యంతో ప్రారంభించిన సత్యసాయి విద్యా వాహిని ప్రాజెక్ట్‌ను మరింత విస్తృతం చేసేందుకు ‘నెక్ట్స్ జెన్’ పేరుతో జాతీయ స్థాయి సదస్సు శుక్రవారం ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యులు, విద్యావాహిని నిర్వాహకులతో కలిసి జ్యోతిప్రజ్వలను చేసి ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యావాహిని ప్రాజెక్ట్‌కు చెందిన 500 మంది యువత సదస్సులో పాల్గొన్నారు. రత్నాకర్‌రాజు మాట్లాడుతూ సత్యసాయి ఆధ్యాతిక బోధనలు, మానవతా విలువలను విస్తృతం చేయాలన్నారు. విద్యా వాహిని ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విజ్ఞానంతో పాటు విలువలను జోడించి బోధన చేస్తున్నామన్నారు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ, సత్యసాయి సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా వాహని పథకం ఎంతో గొప్పదని, వికసిత్ భారత్ 2047లో భాగంగా ‘విద్యావాహిని’కి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. విద్యావాహిని ద్వారా ఏడు రాష్ట్రాల పరిధిలో 38 వేల మంది పాఠశాల విద్యార్థులకు విలువలతో కూడిన సాంకేతిక విద్యను అందిస్తుండడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసుడు రాజగోపాల్ బృందం సంగీత కచేరీ నిర్వహించారు. అనంతరం సత్యసాయి విద్యావాహిని, సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ మధ్య నిర్వహణకు సంబంధించి అవగాహన ఒప్పందం చేసుకున్నారు. పలువురు ప్రముఖులు యువత లక్ష్యాలు, సత్యసాయి బోధనలు అన్న అంశంపై ప్రసంగించారు. సాయంత్రం సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో సదస్సు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
మానవతా విలువలు భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యం
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు
ప్రశాంతి నిలయంలో ప్రారంభమైన ‘నెక్ట్స్ జెన్’ వర్క్‌షాప్


