రూ.2.90 లక్షలు పలికిన వినాయక లడ్డూ | - | Sakshi
Sakshi News home page

రూ.2.90 లక్షలు పలికిన వినాయక లడ్డూ

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

ఎన్‌పీకుంట: గోవిందరాజులపల్లిలో వినాయక లడ్డూ రికార్డు ధర పలికింది. శుక్రవారం నిమజ్జనం సందర్భంగా స్వామి వారి లడ్డూను వేలం వేశారు. గ్రామానికి చెందిన రంగారెడ్డి రెడ్డి మనోహర్‌రెడ్డి రూ.2.90 లక్షలకు లడ్డూను దక్కించుకున్నాడు.

జాతీయస్థాయి

సాఫ్ట్‌బాల్‌ పోటీలకు మైథిలి

తాడిమర్రి: మండలంలోని దాడితోట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని వి.మైథిలి జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు ఎంపికై ంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న మైథిలి సాఫ్ట్‌బాల్‌లో రాణిస్తోంది. ఈ క్రమంలోనే గత నెలలో అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈనెల 11, 12 తేదీల్లో విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటి సెలక్టర్లను ఆకట్టుకుంది. దీంతో వారు 39వ సబ్‌ జూనియర్‌ జాతీయ స్థాయి పోటీలకు మైథిలిని ఎంపిక చేశారు. ఈనెల 26న మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో మైథిలి రాష్ట్రం జట్టు తరఫున ఆడనున్నట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయిని జయలక్ష్మి, హెచ్‌ఎం ఉమామహేశ్వర్‌ తెలిపారు.

మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

పుట్టపర్తి టౌన్‌: కెనరాబ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వారి ఆధ్వర్యంలో టైలరింగ్‌పై మహిళలకు నెలరోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ శాంతిప్రియ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 18 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు కలిగిన గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు అర్హులన్నారు. ఈనెల 19 తేదీ నుంచి నెలరోజుల పాటు శిక్షణ ఉంటుందని, శిక్షణ కాలంలో భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్‌, రేషన్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లతో పాటు నాలుగు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు తీసుకుని బ్రాహ్మణపల్లిపల్లి వద్ద ఉన్న కెనరా బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు 8977718982, 9391486269 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

16 మండలాల్లో వర్షం

పుట్టపర్తి అర్బన్‌: ఇన్నాళ్లూ ముఖం చాటేసిన వరుణుడు చాలా రోజుల తర్వాత జిల్లా వాసులను పలకరించాడు. గురువారం రాత్రి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోగా చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వరకూ జిల్లాలోని 16 మండలాల పరిధిలో మోస్తరు వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పుట్టపర్తిలో 39.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక హిందూపురం మండలంలో 36.2 మి.మీ, బుక్కపట్నం 35.6, కొత్తచెరువు 33.6, గోరంట్ల 16.2, అగళి 15.4, అమడగూరు 12.4, పరిగి 11.6, సీకేపల్లి 10.2, తనకల్లు 6.4, పెనుకొండ 6.2, చిలమత్తూరు 6.2, నల్లమాడ 4.6, నల్లచెరువు 2.2, లేపాక్షి 2.0, తాడిమర్రి 1.2 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

అనంతపురం అగ్రికల్చర్‌: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాగల నాలుగు రోజులూ వర్షం పడే సూచనలు ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ జి.నారాయణస్వామి, రీసెర్చ్‌ అసోసియేట్‌ కె.పావని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో 19న 6.3 మి.మీ, 20న 8.8 మి.మీ, 21న 10 మి.మీ, 22న 10.1 మి.మీ, 23న 6 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొన్నారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో 19న 6.4 మి.మీ, 20న 16 మి.మీ, 21న 8 మి.మీ, 22న 10 మి.మీ, 23న 8.8 మి.మీ మేర వర్షం పడే సూచన ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement