కదిరి టౌన్: వినాయక నిమజ్జనం ఆదివారం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో సాగాలని ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం కదిరిలోని దత్త ఫంక్షన్ హాలులో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, సమయపాలన, సౌండ్ సిస్టమ్ వినియోగం, ప్రజల సహకారం తదితర అంశాలపై ఎస్పీ పలు సూచనలు చేశారు. కదిరిలో పండుగల సందర్భంగా హిందూ ముస్లింలు పరస్పరం సహకరించుకుంటూ శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటలలోపు అన్ని విగ్రహాలూ నిమజ్జన ప్రాంతానికి చేరుకునేలా ఉత్సవ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జన ప్రాంతంలో నాలుగు క్రేన్లు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, లైటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలన్నారు. చిన్న పిల్లలను నిమజ్జన ప్రాంతంలోకి తీసుకురావద్దని సూచించారు. మదనపల్లి రహదారి వద్ద నిమజ్జనం చేసే దేవరచెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖాద్రీ ఆలయ సమీపంలోని మసీదును, పలు వినాయక మండపాలను ఎస్పీ సందర్శించారు. కార్యక్రమంలో డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు బి.వెంకటేశ్వర్లు, నిరంజన్‌రెడ్డి, ఆంజనేయులు, ఎస్‌ఐలు బాబ్జాన్, ధనుంజయ్‌రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దేవరచెరువు వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు
వినాయక ఉత్సవ కమిటీ సభ్యుల
సమావేశంలో ఎస్పీ సతీష్‌కుమార్


