పుట్టపర్తి అర్బన్: పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు రాణించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని డిజిటల్ విద్యను మరింత చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి టీకే అనిల్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టర్ శ్యాం ప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి మండలంలోని జగరాజుపల్లి వద్ద ఉన్న కేజీబీవీ, మోడల్ స్కూళ్లను సందర్శించి పాఠశాల స్థితిగతులు, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు, డిజిటల్ బోధన, మౌలిక వసతుల కల్పనను పరిశీలించారు. పీఎంశ్రీ కింద పాఠశాలకు అందించిన ఆధునిక వసతులు, అభివృద్ధి పనులు, గ్యాలరీ ప్రదర్శనను పరిశీలించారు. డిజిటల్ బోధన కోసం ఏర్పాటు చేసిన క్లికర్ ఆధారిత మూల్యాంకనం ద్వారా విద్యార్థులతో సంభాషించారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వృత్తి విద్య, స్కిల్ ల్యాబ్, క్రీడా ప్రాంగణం, జల సంరక్షణలో భాగంగా వర్షపు నీటి నిల్వలు, కిచెన్ గార్డెన్, పీఏఎల్ ల్యాబ్‌లను పరిశీలించారు. తరగతిలో విద్యార్థులతో పాటు కూర్చొని విద్యా బోధనను పర్యవేక్షించారు. మధ్యాహ్న భోజనశాల, కోడిగుడ్లు, ఆహార పదార్థాల నాణ్యత, సెల్ఫ్ డిఫెన్స్ విద్య, యోగా, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి, అడిషనల్ పీడీ దేవానందరెడ్డి, ఆర్‌జేడీ శ్యామ్యుల్, డీఈఓ కిష్టప్ప, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, స్కౌట్స్‌అండ్ గైడ్స్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.


