ఠారెత్తిస్తున్న ఎండలు | - | Sakshi
Sakshi News home page

ఠారెత్తిస్తున్న ఎండలు

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. బయటికి రావాలంటే జంకాల్సిన పరిస్థితి నెలకొంది. వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణంగా సెప్టెంబర్‌లో 34 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. కానీ, సూపర్‌ ఎల్‌–నినో ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనంతపురం నగరంలో 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. తాడిపత్రి, శింగనమల, ధర్మవరం, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, కదిరి, ఉరవకొండ నియోజకవర్గాల్లో 38 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

15 మీటర్లకు పడిపోయిన భూగర్భ జలాలు

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ రైతులను ముంచేసింది. జూన్‌ నుంచి ఇప్పటివరకు ఒక్క పదునుపాటి వర్షం కూడా పడలేదంటే పరిస్థితి ఎంద దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది సెప్టెంబర్‌లో జిల్లా సరాసరి భూగర్భ జలమట్టం 10.54 మీటర్లు కాగా, ఈ ఏడాది అది 15.19 మీటర్ల దిగువకు చేరింది. అంటే దాదాపు 5 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు ఇంకిపోయాయి. యాడికి మండలం జిల్లాలోనే టాప్‌లో నిలుస్తోంది. ఇక్కడ 66.32 మీటర్ల లోతుకు భూగర్భ జలం పడిపోయిందంటే ఎల్‌–నినో ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పంటలు కాపాడుకునేందుకు అప్పులు చేసి బోర్లు వేస్తున్నా ఫెయిలవుతున్నాయి. 700 అడుగులకు పైగా లోతులో బోర్లు వేస్తున్నా నీరు పడడం లేదని రైతులు చెబుతున్నారు.

జలాశయాల్లోనూ నీటిమట్టం తగ్గుముఖం

అనంతపురం జిల్లాకు ప్రధానంగా శ్రీశైలం, తుంగభద్ర జలాశయాల నుంచి తాగు– సాగు నీరు అందుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు పడలేదు. ఎగువప్రాంతాల్లో కురిసిన అరకొర వర్షాల వల్ల రెండు జలాశయాల్లోకి కొద్దోగొప్పో నీరు వచ్చి చేరింది. హంద్రీ–నీవా కెనాల్‌కు ప్రస్తుతం 2,500 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 115 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. తుంగభద్రలో పూర్తిస్థాయి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 85 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో తుంగభద్రలో సాధారణ నీటి నిల్వ 90 టీఎంసీలుగా ఉంది. కానీ, ఈ ఏడాది సెప్టెంబర్‌నాటికి 85 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.

బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురంలో పండుగ పూట ఇలా...

ఉసూరుమనిపించిన రుతుపవనాలు

ఈ ఏడాది జూన్‌ రెండో వారంలోనే నైరుతి రుతుపవనాలు రాయలసీమను తాకాయి. మబ్బులు ఊరించి ఉసూరుమనిపించాయి. నైరుతి రుతుపవనాల వల్లే దాదాపు 70 నుంచి 80 శాతం వర్షం కురుస్తుంది. ఎల్‌–నినో దెబ్బకు 50 శాతం కూడా వర్షపాతం నమోదవలేవు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వంకలు, వాగులు, చెరువులు, నదులు, డ్యాంలలో చుక్కనీరు కనిపించడం లేదు. ఇప్పటికే గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ ప్రాంతాలలో తాగు నీటి సమస్య మొదలైంది. మరోవైపు పంటలు వాడుముఖం పట్టి నిలువునా ఎండిపోతున్నాయి. పుట్లూరు, యల్లనూరు, గుత్తి, శింగనమల ప్రాంతాల్లో ఎండుతున్న చీనీ చెట్లను కాపాడుకునే మార్గం కనిపించక రైతులు కొట్టేస్తున్నారు.

వేసవిని మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు

మరోవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు

ఎల్‌–నినో ప్రభావంతో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement