ప్రశాంతి నిలయం: సమాజంలోని ప్రతి ఒక్కరికీ పర్యావరణ పరిరక్షణపై అవగాహన అవసరమని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ తెలియజేశారు. సోమవారం కలెక్టర్ బంగ్లాలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్యభరద్వాజ్ కుటుంబ సభ్యులతో కలసి శాస్త్రోక్తంగా వినాయక చవితి పూజల్లో పాల్గొన్నారు. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలకు పూజలు చేశారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షింగా జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఎస్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
పుట్టపర్తి: పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) పునర్ వ్యవస్థీకరణ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసినట్లు డీఈఓ కిష్టప్ప ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ 29న ఎన్నికలు నిర్వహించి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఎస్‌ఎంసీ మార్గదర్శకాలు–2026కు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుందన్నారు.
షెడ్యూల్ వివరాలు
15న ఎస్‌ఎంసీ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల, 18న పాఠశాల నోటీస్ బోర్డులో ఓటర్ల జాబితా ప్రదర్శన, 25న జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, అనంతరం తుది ఓటరు జాబితా ఖరారు, ప్రదర్శన ఉంటుంది. 29న ఎన్నికల నిర్వహణ, అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు.
ముగిసిన స్టేట్ లెవల్
బేస్‌బాల్ పోటీలు
పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించిన 8వ సీనియర్ స్టేట్ లెవల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బేస్ బాల్ చాంపియన్ షిప్ (పురుషులు, మహిళలు) పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలు సెప్టెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకూ జరిగాయి. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి 44 జట్లు పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో నంద్యాల జిల్లా ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. శ్రీకాకుళం జిల్లా ద్వితీయ, విజయనగరం జిల్లా తృతీయ స్థానాల్లో నిలిచాయి. మహిళా విభాగంలో శ్రీకాకుళం జిల్లా, ద్వితీయస్థానం నెల్లూరు జిల్లా, తృతీయస్థానం పల్నాడు జిల్లాలు విజేతలుగా నిలిచాయి. గెలుపొందిన జట్లకు జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ట్రోఫీలను అందజేశారు.
ఉమ్మడి ‘స్థానిక’
పోలింగ్ కేంద్రాలు 2,741
అనంతపురం న్యూ టౌన్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాల్లో ఓటర్లు తమ ఓట్లను వేసేందుకు పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి వెల్లడించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రజల సమాచార నిమిత్తం జిల్లా పరిషత్ కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 63 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల పరిధిలో 2,741 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు వివరించారు. అనంతపురం జిల్లాలోని 31 మండలాలకు గాను 1,507 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. అదేవిధంగా శ్రీసత్యసాయి జిల్లాలోని 32 జిల్లాపరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల్లో 1,234 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ మొత్తం 2,741 పోలింగ్ స్టేషన్ల ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25,18,110 మంది ఓటర్లు 63 మంది జిల్లా ప్రాదేశిక సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాలను విడుదల చేసే కార్యక్రమంలో జిల్లా పరిషత్ పరిపాలన అధికారులు మల్లికార్జున, నందకిషోర్, భాస్కర్‌రెడ్డి, లెక్కల శ్రీనివాసులు, ఫణిశేఖర్‌రెడ్డి, ముత్యాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


