కదిరి అర్బన్: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున మంగళవారం మండల పరిధిలోని కదిరి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. గోవింద నామస్మరణతో పరిసరాలు మర్మోగాయి. భక్తులకు నరేంద్రబాబు, హరికృప దంపతులు అల్పాహారం అందజేశారు. నృసింహ సేవా సమితి సభ్యులు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
వ్యక్తి ఆత్మహత్య
కదిరి అర్బన్: మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున నవీన్‌కుమార్ (31) అనే వ్యక్తి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. రూరల్ మండల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గొర్రెల కాపరి ..
ముదిగుబ్బ: మండల పరిధిలోని ముక్తాపురం గ్రామ పొలాల్లో కొత్తచెరువు మండలం తలమర్ల గ్రామానికి చెందిన కురుబ సూర్యనారాయణ (30) అనే గొర్రెల కాపరి మంగళవారం మామిడి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు ధర్మవరం మండలం రావులచెరువు గ్రామంలో పెళ్లి చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. గొర్రెలు కాయడానికి అక్కడే ఒకరి వద్ద పనికి కుదిరాడు. ఏమైందో తెలియదు కానీ, ముక్తాపురం గ్రామానికి చేరుకుని పొలాల్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
ప్రశాంతిగ్రామంలో చోరీ
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధి ప్రశాంతి గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఫైర్ స్టేషన్ సమీపంలో నివాసముంటున్న మనోహర్ ఇంటికి తాళం వేసుకుని కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామం అమగొండపాలెం వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు సోమవారం అర్ధరాత్రి ఇంటి తలుపులు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న మూడు తులాల బంగారం, రూ.50 వేలు అపహరించారు. ఈ విషయంపై బాధితుడు మనోహర్ మంగళవారం పుట్టపర్తి రూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ క్రాంతి కేసు నమోదు చేసుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలను సేకరించారు.
రెండింతల ఆనందం
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి మండలం పెడపల్లికి చెందిన పాడి రైతు రాజారెడ్డి ఇంట ఒక పాడి ఆవుకు రెండు దూడలు జన్మించాయి. నాలుగేళ్లుగా పెంచుకుంటున్న పాడి ఆవుకు వినాయక చవితి పర్వదినాన మంగళవారం తెల్లవారుజామున ఒకే ఈతలో ఒక పెయ్య, ఒక కుర్ర దూడ జన్మించాయని రైతు ఆనందం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం మరో ఆవుకు ఇలాగే రెండు దూడలు జన్మించినట్లు తెలిపాడు.
మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తికి 7 రోజుల జైలు
గాండ్లపెంట: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తికి 7 రోజుల జైలు శిక్ష పడింది. స్థానిక ఎస్‌ఐ సుమతి, పోలీసులు మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా కదిరి మండలానికి చెందిన ఆదెప్ప మద్యం సేవించి ఆటో నడుపుతూ పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసిన అనంతరం ఆదెప్పను న్యాయస్థానంలో హాజరు పరుచగా న్యాయమూర్తి 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇద్దరికి రూ.19 వేల జరిమానా
తనకల్లు: మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న ఇద్దరు వ్యక్తులకు కోర్టు రూ. 19 వేలు జరిమానా విధించినట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ మంగళవారం తెలిపారు. వివరాలు... రెండు రోజుల క్రితం ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా స్థానిక జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో ఎన్‌పీ కుంట మండలం మూలపల్లికి చెందిన కమలాకర్, తనకల్లు మండలం బాలసముద్రానికి చెందిన సురేష్ మద్యం సేవించి ద్విచక్ర వాహనాలను నడుపుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. కదిరి కోర్టులో నిందితులను హాజరుపరచగా విచారణ అనంతరం కమలాకర్, సురేష్‌కు రూ.19 వేలు జరిమానాను న్యాయమూర్తి విధించారు.


