అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర తాలిమెరెన్ ఆవో అండర్–19 బాలికల జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (టైర్–1) పోటీలు అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో హోరాహోరీగా సాగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం ఢిల్లీ – గుజరాత్, జార్ఖండ్ – బిహార్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగాయి. ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ, గుజరాత్ జట్లు తలపడ్డాయి. 40వ నిమిషంలో వేదిక (జెర్సీ నం. 24) తొలి గోల్ చేసి ఢిల్లీకి ఆధిక్యాన్ని ఇచ్చింది. ప్రత్యర్థి గుజరాత్ ఆటగాళ్లను ఎక్కడికక్కడ ఢిల్లీ క్రీడాకారులు సమర్థవంతంగా అడ్డుకుంటూ తమ ఆధిపత్యాన్ని చూపుతూ వచ్చారు. ఈ క్రమంలోనే స్టోపేజ్ టైమ్ (వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన సమయాన్ని భర్తీ చేయడానికి అదనంగా కేటాయించే సమయం) ఢిల్లీ జట్టుకు కలిసొచ్చింది. ఢిల్లీ క్రీడాకారిణి సునైనా (జర్సీ నం. 99) అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్ సాధించి ఢిల్లీకి 3–0తో విజయాన్ని ఖాయం చేసింది.
● మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్, బిహార్ జట్లు తలపడ్డాయి. ఆట ప్రారంభం నుంచే బిహార్‌పై జార్ఖండ్ జట్టు ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. మైదానం నలుమూలలా జార్ఖండ్ క్రీడాకారులు మెరుపు వేగంతో కదులుతూ బిహార్ జట్టు క్రీడాకారులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆట ప్రారంభమైన తొలి రెండో నిమిషంలోనే 15వ నంబర్ జెర్సీ ధరించిన జార్ఖండ్ క్రీడాకారిణి అద్భుత గోల్‌ను సాధించి జట్టు క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపింది. అనంతరం 49వ నిమిషంలోనూ మరో గోల్ సాధించింది. ఆట 22వ నిమిషంలో కొనసాగుతుండగా 8వ నంబర్ జెర్సీ ధరించిన క్రీడాకారిణి ఓ గోల్, 18వ నంబర్ జెర్సీ ధరించిన మరో క్రీడాకారిణి ఇంకో గోల్ చేశారు. దీంతో జట్టు 4–0 గోల్స్ ఆధిక్యంలో ఉండగా స్టోపేజ్ టైమ్ కలిసి వచ్చింది. దీంతో 8వ నంబర్ జెర్సీ ధరించిన క్రీడాకారిణి మరో గోల్ సాధించడంతో 5–0 గోల్స్ తేడాతో జార్ఖండ్ జట్టు విజయ కేతనం ఎగుర వేసింది.
బిహార్ క్రీడాకారిణికి ఎల్లో కార్డ్
జార్ఖండ్ క్రీడాకారుల దూకుడుతో సహనం కోల్పోయిన బిహార్ క్రీడాకారిణి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో రెఫరీ ఎల్లో కార్డు చూపారు. ఆట 83వ నిమిషంలో కొనసాగుతుండగా బిహార్‌కు చెందిన 9వ నంబర్ జెర్సీ ధరించిన క్రీడాకారిణి తన ప్రత్యర్థిని ప్రమాదకర రీతిలో కిందపడేసింది. దీంతో బిహార్ క్రీడాకారిణిని హెచ్చరిస్తూ రెఫరీ ఎల్లో కార్డు చూపారు. మ్యాచ్‌లను ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి డానియల్ ప్రదీప్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు దాదా ఖలందర్ పర్యవేక్షించారు.


