ని‘బంధనాల’తో పెన్షన్‌ కోతలు | - | Sakshi
Sakshi News home page

ని‘బంధనాల’తో పెన్షన్‌ కోతలు

Sep 12 2026 12:18 AM | Updated on Sep 12 2026 12:18 AM

కదిరి అర్బన్‌: ‘తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి’ అన్న చందంగా మారింది సామాజిక భద్రతా పెన్షన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ. అసలే గడువు తక్కువ. అందులోను పండుగల సెలవులు, ఇవి చాలదన్నట్లు దరఖాస్తులు స్వీకరించేందుకు సవాలక్ష నిబంధనలు. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన హసీనా భర్త మరణించి మూడేళ్లు అవుతోంది. హసీనాకు ముగ్గురు సంతానం. కుటుంబానికి రేషన్‌కార్డు ఉంది. భర్త డెత్‌ సర్టిఫికెట్‌, ఆదాయ ధ్రువీవకరణ పత్రం కూడా తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్‌ దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో ఇటీవల హసీనా కుమ్మరవాండ్లపల్లి సచివాలయానికి వెళ్తే అక్కడ హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో ఆమె కదిరి మున్సిపాలిటీలోని రాజేంద్రప్రసాద్‌ వీధిలో కాపురం ఉన్నట్లు చూపిస్తోంది. అదే హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో హసీనా కుమార్తె ఆసియాకు వితంతు పెన్షన్‌ వస్తోంది. ఈ క్రమంలో ఒకే ఇంట్లో ఇద్దరు పెన్షన్‌కు అర్హులు కారని అధికారులు చెబుతుండడం గమనార్హం. రేషన్‌కార్డులు వేరుగా ఉన్నప్పటికీ కేవలం హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో అందరూ కలిసి ఉన్నట్లు చూపిస్తుండడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు తీసుకోవడం లేదు. ప్రస్తుతం హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో హసీనా కుటుంబాన్ని వేరు చేసే ఆప్షన్‌ లేకపోవడంతో పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి అర్హులు నష్టపోకుండా నిబంధనలు సడలించాలని పలువురు కోరుతున్నారు.

వివాహిత ఆత్మహత్య

శింగనమల: మండలంలోనివె వెస్ట్‌ నరసాపురం గ్రామంలో ఓ వివాహిత శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన మల్లేశ్వరి(26)కి నార్పల మండలం బొందలవాడకు చెందిన నాగేంద్రతో ఒకటిన్నర సంవత్సరం క్రితం వివాహం జరిగింది. నెలరోజులకే భర్తతో ఉండడం ఇష్టం లేక మల్లేశ్వరి స్వగ్రామం వచ్చేసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కాశీపురంలో వృద్ధురాలు..

రాయదుర్గం రూరల్‌: అనారోగ్యం బారిన పడిన హరిజన లక్ష్మక్క (78) అనే వృద్ధురాలు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన మండలంలోని కాశీపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన మేరకు లేట్‌ హరిజన గంగన్న భార్య లక్ష్మక్క ఒక్కగానొక్క కుమారుడితో ఉంటోంది. గురువారం రోజు వ్యవసాయ కూలి పనులకు కూడా వెళ్లి వచ్చింది. అయితే రాత్రి అనారోగ్యానికి గురైన ఆమె బాధను భరించలేక, కుమారుడు, కోడలికి చెప్పుకోలేక, శుక్రవారం ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

గుత్తి రూరల్‌: మండలంలోని బేతాపల్లి గ్రామంలో శుక్రవారం టెంకాయ చెట్టుపై నుంచి పడి పృథ్విరాజు (35) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పృథ్విరాజు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అమావాస్య కావడంతో గ్రామ శివారులోని తన తోట వద్ద ఉన్న చెట్టుపై టెంకాయలు తెచ్చేందుకు వెళ్లాడు. చెట్టు ఎక్కి టెంకాయలు, పట్టలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ అదుపు తప్పి చెట్టుపై నుంచి కిందకు పడ్డాడు. ఎంతసేపయినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు తోట వద్దకు వెళ్లారు. తీవ్ర గాయాలతో చెట్టు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న పృథ్విరాజును గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే గ్రామంలోని పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన చికిత్సలకు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పృథ్విరాజు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఇంటి పెద్ద దిక్కు మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య మౌనిక, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement