యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా

Sep 12 2026 12:18 AM | Updated on Sep 12 2026 12:18 AM

చిలమత్తూరు: మండల పరిధిలోని దిగువపల్లి తండా సమీపంలో టీడీపీ నాయకులు యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా సాగిస్తున్నారు. రైతుల పొలాలకంటూ కప్పిపుచ్చుకుంటుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇరిగేషన్‌ అధికారుల వద్ద తీసుకున్న అనుమతుల కంటే ఎక్కువగా మట్టిని తోడేస్తున్నారు. దీంతో చెరువుల్లో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

మహిళను వేధిస్తున్న

వ్యక్తిపై కేసు

పరిగి: మండలంలోని కాలువపల్లి వద్ద ఉన్న ఓ గార్మెంట్స్‌ పరిశ్రమలో పని చేస్తున్న మహిళా కార్మికురాలిపై అదే పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న వ్యక్తి వేధింపులకు గురిచేశాడరు ఆరోపణతో శుక్రవారం పరిగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇండియన్‌ టెక్స్‌పోర్టు డిజైన్స్‌ గార్మంట్స్‌ పరిశ్రమలో కర్ణాటక రాష్ట్రం గుట్టకొడిగెనహళ్లికి చెందిన మంజునాథ్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. తన డిపార్టుమెంట్‌లోనే పనిచేస్తున్న పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లికి చెందిన ఓ మహిళను కొంత కాలంగా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. శుక్రవారం బాధితురాలు పరిగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మంజునాథ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

20 క్వింటాళ్ల

రేషన్‌ బియ్యం పట్టివేత

బత్తలపల్లి: అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రెవెన్యూ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. అధికారులు తెలిపిన సమాచారం మేరకు... మండలంలోని సంగాల గ్రామానికి చెందిన గుజ్జల రామకృష్ణ కొందరు డీలర్లతో పాటు తెల్లరేషన్‌ కార్డుదారుల ద్వారా సేకరించిన బియ్యాన్ని పుట్టపర్తి మండలం బుగ్గపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్‌ అలియాస్‌ సోముకు విక్రయిస్తున్నాడు. అందులో భాగంగా కార్డుదారుల నుంచి సేకరించిన రేషన్‌ బియ్యాన్ని శుక్రవారం (ఏపీ 26 టీబీ5846) అశోక్‌ లేలాండ్‌ వాహనంలో తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రెవెన్యూ అధికారులు చిత్రావతి బ్రిడ్జి వద్ద వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు. అందులో 20 క్వింటాళ్ల (46 బ్యాగులు) రేషన్‌ బియ్యం ఉండటంతో వాహనాన్ని సీజ్‌ చేసి బత్తలపల్లి పోలీసులకు అప్పగించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ధర్మవరం గోదాముకు తరలించారు. అలాగే రేషన్‌ బియ్యం తరలిస్తున్న గుజ్జల రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ సద్గురుడు, సిబ్బంది, సీఎస్‌డీటీ ప్రసన్నకుమార్‌, వీఆర్‌ఓ రాణా ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యాయం కోసం రాస్తారోకో

ఉరవకొండ: పట్టణ శివారులోని టీవీ టవర్‌ సమీపంలో ఈ నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం ఉరవకొండ ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కూలీనాలీ చేసుకుని జీవించే తమ కుటుంబాలకు పోషించే దిక్కు లేకుండా పోయిందన్నారు. ఐచర్‌ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో సంబంధిత యజమాని నుంచి తమకు పరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో ఉరవకొండ సీఐ మహనంది, ఎస్‌ఐ జనార్థన్‌నాయుడు అక్కడికి చేరుకున్నారు. కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు శాంతించి మృతదేహాలను స్వగ్రామం వజ్రకరూరుకు తరలించారు.

విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి

తాడిపత్రి రూరల్‌: మండలంలోని బ్రహ్మణపల్లి వద్ద వ్యవసాయ పొలంలో విద్యుత్‌ షాక్‌కు గురై బాషా (45) అనే వ్యక్తి మృతి చెందాడని అప్‌గ్రెడ్‌ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. గ్రామంలో సురేష్‌రెడ్డికి చెందిన మోటార్‌ పనిచేయకపోవడంతో స్టార్టర్‌ను రిపేరీ చేస్తున్న సమయంలో బాషా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడన్నారు. వెంటనే చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement