బొమ్మనహాళ్: పరిహారం పెంచాకనే నిర్మాణాలు చేపట్టాలంటూ పవర్ గ్రిడ్ టవర్ల పనులను రైతులు అడ్డుకున్నారు. మండలంలోని ఎల్‌బీ నగర్ సమీపంలో విద్యుత్ పవర్ గ్రిడ్ టవర్ల నిర్మాణం శుక్రవారం ఉద్రిక్తతకు దారి తీసింది. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో రాయదుర్గం, కళ్యాణదుర్గం రూరల్ సీఐలు వెంకటరమణ, గంగాధర, బొమ్మనహాళ్, కణేకల్లు, డి.హీరేహాళ్ ఎస్‌ఐలు నబీరసూల్, నాగమధు, గురుప్రసాద్‌రెడ్డితో పాటు భారీగా పోలీసులు మోహరించారు. పోలీసు బందోబస్తు నడుమ టవర్ల నిర్మాణానికి కంపెనీ ప్రతినిధులు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తగిన పరిహారం చెల్లించకుండా బలవంతంగా తమ వ్యవసాయ భూముల్లో పనులు చేపడుతున్నారంటూ బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో ఎకరానికి రూ.12 లక్షలు ఇస్తుండగా, ఇక్కడ రూ.4 లక్షలు ఇస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. న్యాయమైన పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని, అయినప్పటికీ టవర్ ఏర్పాటుకు అధికారులు, కంపెనీ ప్రతినిధులు చర్యలు చేపట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవర్ గ్రిడ్ పనులను అడ్డుకున్న రైతులు లక్ష్మీ, సుబ్బమ్మ, అమర్‌తో పాటు మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం పొలంలో మొక్కజొన్న పంటను తొలగించి పనులు చేపట్టడం గమనార్హం.


