అనంతపురం ఎడ్యుకేషన్: రాయలసీమకు సాగునీరు అందించేందుకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తగినంత నీటిని విడుదల చేయాలంటూ వక్తలు గళమెత్తారు. అఖిల భారత రైతు–కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) 9వ రాష్ట్ర మహాసభలు శుక్రవారం అనంతపురం నగరంలోని డాక్టర్ అంబేడ్కర్ విజ్ఞాన భవన్‌లో ప్రారంభమయ్యాయి. తొలుత అంబేడ్కర్ భవన్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకారుల నృత్య ప్రదర్శనతో సాగిన ర్యాలీలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు రామ్‌కుమార్, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ప్రభాకర్ ఎర్రజెండాను ఎగురవేశారు. అనంతరం ప్రారంభ సభను ఇండ్ల ప్రభాకర్, ఎం.దుర్గాప్రసాద్, ఎస్.వి.వి.సత్యనారాయణ అధ్యక్షవర్గంగా నిర్వహించారు. రామ్‌కుమార్ మాట్లాడుతూ రాయలసీమకు సాగునీరు అందించేందుకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని, గోదావరి, కృష్ణా నదుల నుంచి రాయలసీమకు నీటి కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహాసభల్లో రైతాంగ సమస్యలతో పాటు రాయలసీమ సాగునీటి సమస్యపై లోతుగా చర్చించి కార్యాచరణ రూపొందించాలని కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ కన్వీనర్, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రారంభోపన్యాసం చేశారు. రాయలసీమలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల ద్వారా ఆశించిన స్థాయిలో సాగునీరు అందడం లేదని అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రాజెక్టుల పూర్తి ప్రయోజనం రైతులకు దక్కడం లేదని పేర్కొన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బి.దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ప్రాంతంలో సాగునీటితో పాటు తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు. మహాసభలో ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఐలయ్య ప్రసంగించారు.
ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభల్లో వక్తల గళం


