ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టివేత

Sep 12 2026 12:18 AM | Updated on Sep 12 2026 12:18 AM

హిందూపురం టౌన్‌: రైళ్ల ద్వారా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిఘా, తనిఖీలు కొనసాగిస్తున్నామని హిందూపురం అడిషనల్‌ ఎస్పీ కేవీ మహేష్‌ తెలిపారు. శుక్రవారం హిందూపురం, పెనుకొండ రైల్వే స్టేషన్లలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ఏఎస్పీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా హిందూపురం రైల్వే స్టేషన్‌లో భువనేశ్వర్‌–ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 50 మంది పోలీసు సిబ్బంది, డాగ్‌ స్క్వాడ్‌తో రైలులోని వివిధ బోగీల్లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. అరగంట పాటు కొనసాగిన తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, ప్రయాణికుల సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఏడు చిన్న ప్యాకెట్లలో 100 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి తరలింపునకు ఉపయోగించిన సూట్‌కేసును కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ కేవీ మహేష్‌ తెలిపారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితుడిని జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. రైళ్లలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఏఎస్పీ తెలిపారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిశితంగా పరిశీలించడంతో పాటు డాగ్‌ స్క్వాడ్‌ సహాయంతో తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు, ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐలు అబ్దుల్‌ కరీం, ఈగల్‌ ఎస్‌ఐ శ్రీధర్‌, ఎస్‌ఐ రాజేష్‌తో పాటు ఆర్పీఎఫ్‌, ఏఆర్‌, ఈగల్‌ బృందం, డాగ్‌ స్క్వాడ్‌, సబ్‌డివిజన్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement