సాక్షి, పుట్టపర్తి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి పార్టీల నేతలు అక్రమార్జనకు అలవాటు పడ్డారు. సహజవనరులు కొల్లగొట్టి కొందరు రూ.కోట్లు సంపాదించగా... మరికొందరు పేదల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఎవరైనా అడ్డుచెబితే ముఖ్యనేతలతో ఫోన్లు చేయించి బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి పార్టీల నేతలు రేషన్ బియ్యం దందాలో ఆరితేరారు. పొరుగున ఉన్న కర్ణాటకలో మన బియ్యానికి బాగా డిమాండ్ ఉండటంతో ఇక్కడ కార్డుదారుల నుంచి కొనుగోలు చేసి కర్ణాటకలో విక్రయిస్తున్నారు. మరికొందరు కర్ణాటకలోని రైస్‌మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేయించి సంచులు మార్చి జిల్లాలోని పేదలకే వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
మంత్రుల ఇలాకాలోనే..
మంత్రులు సవిత, సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాల్లోనే రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు సిండికేటుగా మారారు. రేషన్ బియ్యం దందాలోకి ఎవరినీ రానీయకుండా కట్టడి చేస్తూ అంతా వారి కనుసన్నల్లోనే నడిచేలా చూస్తున్నారు. ఈ క్రమంలోనే సోమందేపల్లికి చెందిన ఓ వ్యక్తి.. ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసి రాత్రి వేళల్లో ఎన్‌ఎస్ గేటు, పెనుకొండ, కొడికొండ మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలోని ఓ మంత్రి అండదండలు ఉండటంతో పోలీసులు కూడా సదరు వ్యక్తి వాహనాలను నిలువరించలేని పరిస్థితి నెలకొంది. ఆ ఒక్కడి ఆధ్వర్యంలో రోజూ లారీ రేషన్ బియ్యం జిల్లా దాటిపోతున్నట్లు తెలిసింది. ఇక ఎవరైనా రేషన్ బియ్యం రవాణా చేసినా సదరు వ్యక్తికి కమీషన్ ఇవ్వాల్సిందే. లేకపోతే అధికారులకు సమాచారం ఇచ్చి వాహనాలను పట్టిస్తారని తెలుస్తోంది.
దర్జాగా హద్దు దాటిపోతూ..
దందా రాయుళ్లు నియోజకవర్గానికి ఒకరిని ఏజెంటుగా నియమించుకుని గ్రామాల్లోని పేదల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కిలో రూ.17 నుంచి రూ.20 వరకూ కొనుగోలు చేస్తున్నారు. అలా సేకరించిన బియ్యాన్ని ఆటోలో తరలించి ఒక చోట నిల్వ చేస్తున్నారు. అనంతరం పెనుకొండ, సోమందేపల్లి, రామగిరి మీదుగా కర్ణాటక తరలిస్తున్నారు. జిల్లాలో 32 మండలాలు ఉండగా.. 16 మండలాలకు కర్ణాటక సరిహద్దు ఉండటంతో రేషన్ బియ్యాన్ని సులువుగా సరిహద్దు దాటిస్తున్నారు. ఎక్కువగా ధర్మవరం, నల్లమాడ, కొత్తచెరువు ప్రాంతాల నుంచి పెనుకొండ, సోమందేపల్లి మీదుగా కర్ణాటక తరలిస్తున్నట్లు సమాచారం. ప్రజలే సమాచారం ఇస్తుండగా... అక్కడక్కడా పోలీసులు రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
రూ.కోట్లలో లావాదేవీలు
రేషన్ బియ్యం దందాలో ప్రతి నెలా రూ.3 కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఇందులో ఎవరి వాటా వారికి వెళ్లినా.. ఒక్కో వ్యక్తికి సగటున రూ.5 లక్షలు మిగులుతున్నట్లు తెలుస్తోంది.
పాలిష్ చేసి మళ్లీ పేదలకే విక్రయం
కొందరు తక్కువ ధరకు పేదల నుంచి రేషన్ బియ్యం కొని వాటిని కర్ణాటకకు తీసుకువెళ్లి అక్కడ మిల్లుల్లో పాలిషింగ్ చేసి తిరిగి మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. కూటమి నేతలే అక్రమ వ్యాపారులుగా అవతారమెత్తి.. బియ్యం దందాను నడిపిస్తుండటంతో అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మరికొందరు మాత్రం రేషన్ బియ్యాన్ని నేరుగా కర్ణాటకలో అధిక ధరలకు విక్రయించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో రేషన్ షాపుల నుంచి నేరుగా నల్లబజారుకు చౌక బియ్యం తరలిపోతున్నట్లు తెలిసింది.
జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం వ్యాపారం
గుట్టు చప్పుడు కాకుండా రాత్రివేళ కర్ణాటకకు రవాణా
ఆటోలు, ఐచర్ వాహనాల్లో అక్రమంగా తరలింపు
రేషన్ బియ్యం మాఫియాగా కొందరు కూటమి నేతలు
తక్కువ ధరలకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయం
దర్జాగా సరిహద్దు దాటిపోతున్నా పట్టించుకోని అధికారులు
2025 డిసెంబరు 28 : ధర్మవరం నుంచి 1,300 కిలోల రేషన్ బియ్యాన్ని బెంగళూరు తీసుకెళ్తున్నట్లు సమాచారంతో ధర్మవరం వన్‌టౌన్ పోలీసులు ఎర్రగుంట్ల సర్కిల్‌లో పట్టుకున్నారు. ఆటోను సీజ్ చేసి.. డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. కిలో రూ.18 వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలిసింది.
2025 జూలై 23 : చెన్నేకొత్తపల్లి మండలం ఎర్రంపల్లి బస్టాప్ వద్ద ఆటోల్లో తెచ్చిన రేషన్ బియ్యం.. లారీల్లోకి మార్చే దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి పోలీసులకు పంపించారు. అయినా పోలీసులు స్పందించలేదు. పైగా ఆ తర్వాత వీడియో పంపిన వ్యక్తికి రేషన్ బియ్యం వ్యాపారి ఫోన్ చేసి బెదిరించాడు.
2026 మే 7 : హిందూపురం మండలం మణేసముద్రం పరిసరాల్లో రేషన్ బియ్యంతో వెళ్తున్న ఐచర్ వాహనాన్ని హిందూపురం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వాహనంలోని 16 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
2026 జూన్ 4 : కర్ణాటకకు రేషన్ బియ్యం తరలిస్తున్న పుట్టపర్తికి చెందిన ఓ వ్యాపారిని మామిళ్లపల్లి వద్ద స్థానికులు అడ్డుకున్నారు. వాహనాలను వీడియో తీయగా.. వ్యాపారి వీడియో తీసిన స్థానికుడి మొబైల్ లాక్కుని.. కారులో పరారయ్యాడు. అనంతరం ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.


