హిందూపురం టౌన్: పోలీసులపై దాడులకు పాల్పడిన దొంగల ముఠాను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. గతంలో పందులను దొంగిలించేందుకు బొలెరో వాహనంలో వచ్చిన ముఠా సభ్యులు పోలీసులను సైతం లెక్కచేయకుండా రెండు సార్లు దాడులకు పాల్పడి పరారయ్యారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి 11 మంది ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హిందూపురం ఏఎస్పీ మహేష్‌తో కలిసి ఎస్పీ సతీష్‌కుమార్ విలేకరులకు వివరాలు వెల్లడించారు.
కేసు పూర్వాపరాలు ఇలా..
గత నెల 6న రాత్రి హిందూపురం పట్టణంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా, చిన్నమార్కెట్ సమీపంలో ఓ బొలెరో వాహనం ఆపకుండా వేగంగా వెళ్లింది. వెంబడించిన పోలీసులపై ముఠా సభ్యులు దాడి చేయడానికి ప్రయత్నించారు. సీఐని వాహనంతో గుద్దేందుకు ప్రయత్నించారు. సీఐ చాకచక్యంగా తప్పించుకున్నారు. అదే నెలలో 27న అర్ధరాత్రి సమయంలో హిందూపురం రూరల్ సీఐ జనార్దన్ స్థానిక అంబేడ్కర్ సర్కిల్‌లో గస్తీలో ఉండగా, అదే సమయంలో ఓ బొలెరో రావడంతో అనుమానం వచ్చి పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. వారు ఆపకుండా వెళ్లడంతో సీఐ జనార్దన్ ఇతర పోలీసులను అలర్ట్ చేశారు. పోలీసులపైనే రాళ్లు, బాటిళ్లతో దాడులకు యత్నించారు. దీంతో రూరల్ సీఐ జనార్దన్ దుండగుల వాహనంపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా దుండగులు తప్పించుకుపోయారు. దీనిపై హిందూపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి.
ముఠా అరెస్ట్...
హిందూపురం పట్టణ శివారులో హైవేపై దారిదోపిడీకి సిద్ధమవుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం పట్టణంలోని సింగిరెడ్డిపల్లి శివారులో శిరా–కొడిగెనహళ్లి ఎన్‌హెచ్–544ఈ రహదారి వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా మారణాయుధాలతో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వన్‌టౌన్ సీఐ ప్రసాద్‌బాబు, టూటౌన్ సీఐ అబ్దుల్ కరీం, హిందూపురం రూరల్ సీఐ జనార్దన్, యూపీఎస్ సీఐ ఆంజనేయులు, వన్‌టౌన్ ఎస్‌ఐ రాజేష్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ముఠాలోని 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు హైవేపై రవాణా అవుతున్న పందుల లోడును దారి కాచి పందులను దొంగిలించేందుకు సిద్ధమైనట్లు వెల్లడైంది. వారి వద్ద నుంచి రూ.8.50 లక్షల నగదు, రెండు బొలెరో పికప్ వాహనాలు, ఆరు పిడిబాకులు, దాడి చేయడానికి ఉంచుకున్న రాళ్లు, 20 ఖాళీ కూల్‌డ్రింక్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో పోలీసులపై దాడికి పాల్పడిన ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. విచారణలో గత నెల 27న హిందూపురం పట్టణంలో 10 పందులను దొంగలించినట్లు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.
అరెస్టు అయిన వారిలా..
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అనంతపురానికి చెందిన ఎరికల చంద్రశేఖర్, సాకే రాజేష్, ఎరికల రమేష్, వెంకటేష్, బెస్త రాకేష్, సాకే మహేష్, ఎరికల గంగన్న, నడిమిండ్లు లక్ష్మణ్, ఎరికల సునీల్, జె.రోహిత్, హిందూపురానికి చెందిన వెంకటేష్ ఉన్నారు. వీరు పందులను దొంగలించి కర్ణాటక, అనంతపురం ప్రాంతాల్లో విక్రయించేవారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన పందులను కొన్న అనంతపురం, కర్ణాటకకు చెందిన వారిని కూడా పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
నిందితులపై కేసులు
ప్రస్తుతం అరెస్టు అయిన ముఠా సభ్యులపై హిందూపురం వన్‌టౌన్, ఉరవకొండ, తాడిపత్రి టౌన్, తాడిపత్రి రూరల్, గుంతకల్లు రూరల్, కసాపురం, యల్లనూరు, కళ్యాణదుర్గం అర్బన్, డోన్ రూరల్, అమరాపురం, నల్లమాడ, బుక్కరాయసముద్రం తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, పోలీసులపై దాడులు, హింసాత్మక నేరాలకు సంబంధించిన పలు కేసులు నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐలు ప్రసాద్ బాబు, ఆంజనేయులు, జనార్ధన్, కరీం, ఎస్‌ఐ రాజేష్, ఉమ్మడి అనంతపురం జిల్లా క్రైమ్ పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులను అందించారు.
11 మంది అరెస్ట్, పరారీలో ఇద్దరు
రూ.8.50 లక్షల నగదు, రెండు బొలెరోలు, మారణాయుధాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్‌కుమార్
దోపిడీ ముఠాకు పోలీస్ ట్రీట్‌మెంట్
బేడీలు వేసి నడిపించుకుంటూ తీసుకెళ్లిన వైనం
దారి దోపిడీ, పందుల దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులపైనే దాడులకు పాల్పడుతున్న 11 మంది దోపిడీ ముఠా సభ్యులకు పట్టణ ఖాకీలు పోలీస్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. బుధవారం సాయంత్రం ముఠా సభ్యులను అరెస్టు చేశారు. అనంతరం సీఐలు ప్రసాద్‌బాబు, అబ్దుల్ కరీం, జనార్దన్ ఆంజనేయులు సమక్షంలో పోలీసు సిబ్బంది స్థానిక గురునాథ్ సర్కిల్ నుంచి తెలుగుతల్లి సర్కిల్ వరకు నిందితుల చేతులకు బేడీలు వేసి ఊరేగించారు. ప్రజల్లో భయభ్రాంతులు కలిగించేలా, అడ్డొచ్చిన వారిని అంతమొందించేలా దాడులకు తెగబడుతున్న దోపీడి ముఠాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించడానికి నిందితులను ఊరేగించామని పేర్కొన్నారు.


