చిలమత్తూరు: సహకార కేంద్ర బ్యాంకు అక్రమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. అడిగేవారు లేకపోవడంతో బ్యాంకు అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ బ్యాంకుకే తీరని నష్టం కలిగిస్తున్నారు. భూములను తాకట్టుపెట్టుకుని రుణాలు ఇస్తున్న బ్యాంకు సిబ్బంది రుణదాతలు రుణం మొత్తం చెల్లించినా... బ్యాంకులో చెల్లించకుండా సెక్రటరీలు మింగేసిన ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో స్కాం రాష్ట్రంలో సంచలనంగా మారింది. హిందూపురం ఏడీసీసీ బ్యాంకులో భారీ స్కాం బయటపడింది. బ్యాంకుల్లో పనిచేసే గోల్డ్ అప్రైజర్ ద్వారా నకిలీ బంగారం తనఖా పెట్టించి సుమారు రూ.8 కోట్లు రుణాలు పొందడం సంచలనంగా మారింది. ఈ ఘటనతో హిందూపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
బ్యాంకు సిబ్బంది పాత్రపై అనుమానాలు
జిల్లా సహకార సంఘం బ్యాంకులో జరిగిన భారీ గోల్డ్ స్కాంలో ఇక్కడే పాతుకుపోయిన అధికారుల పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఘటన తో బ్యాంకులో పనిచేసే సిబ్బంది అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ స్కాంలో సూత్రధారులుగా అనుమానిస్తున్న బ్యాంకు మేనేజరు జయరాం చౌదరి, అసిస్టెంట్ మేనేజరు కంబగిరి, సహాయకురాలు అర్చనాభాయిలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
గుట్టుగా విచారణ
ఏడీసీసీబీ అధికారులు హిందూపురంలోనే తిష్ట వేసి అవినీతి అంశంపై విచారణ వేగవంతం చేశారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఉంటూ నకిలీ బంగారం తాకట్టు అంశానికి సంబంధించి గుట్టుగా విచారణ జరుపుతున్నారు. నకిలీ బంగారం తాకట్టుపై ఇప్పటికే మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. సహకార బ్యాంకుల్లో ఇంత పెద్ద స్కాం బయట పడటం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
గోల్డ్‌స్కాం కేరాఫ్‌గా మారిన
హిందూపురం ఏడీసీసీబీ
నకిలీ బంగారంతో
బ్యాంకుకు భారీ టోకరా
మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
సహా ముగ్గురు సస్పెండ్
సమగ్ర విచారణ చేపట్టిన
బ్యాంకు ఉన్నతాధికారులు
ఎస్పీకి ఫిర్యాదు ?
నకిలీ ఖాతాలు.. నకిలీ బంగారం
ఏడీసీసీ బ్యాంకులో సాధారణ తనిఖీలు నామమాత్రంగా సాగుతుండటంతో అక్రమార్కుల పంట పండింది. కేవలం రైతులు మాత్రమే రుణాలు తీసుకొనే ఈ బ్యాంకుల్లో నకిలీ రైతులను సృష్టించి, అదే విధంగా పదుల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు తెరచి వాటి ద్వారా నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి వాటిని తనిఖీ చేసే అప్రైజర్‌తో బ్యాంకు అధికారులు కుమ్మకై ్క ఈ భారీ స్కాంకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. తవ్వే కొద్దీ అక్రమాల చిట్టా బయటకు వస్తుండటం సంచలనంగా మారింది. ఈ విషయం అధికారికంగా బయటకు చెప్పనప్పటికీ బ్యాంకు ఉన్నతాధికారులు ఈ స్కాంపై ఐదు రోజులుగా విచారణ చేస్తూనే ఉండటంతో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
గోల్డ్ స్కాం వ్యవహారంలో బ్యాంకులో పనిచేసే సిబ్బంది పాత్ర ఉండటంతో విచారణ అధికారులకు వారు ఏమాత్రం సహకరించనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే భారీగా రుణాలు ఇచ్చినట్టు గుర్తించిన అధికారులు, ఈ వ్యవహారం పై పోలీసులు విచారణ చేస్తేనే నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో బుధవారం ఎస్పీ సతీష్‌కుమార్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది.


