అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

Sep 10 2026 12:03 AM | Updated on Sep 10 2026 12:03 AM

రొళ్ల: ఒంటరిగా ద్విచక్ర వాహనంలో వెళ్లే వారిని టార్గెట్‌ చేస్తూ బంగారు ఆభరణాలను కాజేస్తున్న అంతర్రాష్ట్ర చైన్‌ స్నాచింగ్‌ దొంగ మహమ్మద్‌ ఇరానీ ఆలీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ కె.నరసింహుడు విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మే 23న టీడీ పల్లికి చెందిన తిమ్మారెడ్డి ద్విచక్ర వాహనంలో రొళ్లకు వస్తున్నాడు. మార్గ మధ్యలో హెచ్‌ఎం పల్లి గ్రామ సమీపాన అటవీ ప్రాంతం ఆనుకుని ఉన్న గుడిబండ ప్రధాన రోడ్డు పక్కన వెలసిన బైలాంజనేయస్వామి ఆలయం వద్దకు రాగానే మహమ్మద్‌ ఇరానీ ఆలీతో పాటు ఆయన మామ అబ్బస్‌ ఇద్దరు స్కూటీలో వచ్చి తిమ్మారెడ్డి వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని అడ్డగించారు. ముందు వెళ్లేదారిలో పోలీసులు ఉన్నారని, వాహనానికి సంబంధించిన రికార్డులు చూపాలని మాట కలిపి తిమ్మారెడ్డి చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని దౌర్జన్యాంగా లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాతీయ రహదారిలో ఓ షాపు వద్ద అమర్చిన సీసీ ఫుటేజీ ఆధారంగా ముద్దాయిని గుర్తించారు.

రంగనపల్లి క్రాస్‌ వద్ద అరెస్ట్‌...

రొళ్ల మండలం రంగనపల్లి క్రాస్‌ వద్ద ముద్దాయి మహమ్మద్‌ ఇరానీఆలీ తన స్కూటిలో హిందూపురం నుంచి రొళ్లకు వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని జేబులో బంగారు ఉంగరం దొరికింది. వెంటనే అతన్ని పోలీసుల శైలిలో విచారణ చేశారు. నిందితుడిది మహారాష్ట్రలోని థానే జిల్లాలో అంబావలి అని, రెండేళ్లక్రితం హిందూపురంలో వివాహం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అప్పుడప్పుడూ సొంత ఊరికి వెళ్లొచ్చేవాడన్నారు. దీనికి తోడు హిందూపురంలోని ఓ హోటల్‌లో వంట మనిషిగా కూడా పని చేసేవాడని తెలిపారు. జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని తన మామ అయిన అబ్బాస్‌తో చిన్న దొంగతనాలతో పాటు ఒంటరిగా ద్విచక్ర వాహనంలో తిరుతున్న వారిని టార్గెట్‌ చేసేవాడని పేర్కొన్నారు. బంగారు చైన్‌, ఉంగరాలను లాక్కొని వెళ్లేవారన్నారు. ముద్దాయి మామ అబ్బాస్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. మహమ్మద్‌ఇరానీఆలీని అరెస్ట్‌ చేసి మడకశిర జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ (జేఎఫ్‌సీఎం) న్యాయమూర్తి అశోక్‌కుమార్‌ ఎదుట హాజరు పరచగా రిమాండ్‌ విధించారు. నేరం చేయడానికి ఉపయోగించిన స్కూటీతో పాటు బంగారు ఉంగరాన్ని సీజ్‌ చేశామన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement