మహిళా రైతు ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

Aug 20 2026 7:20 AM | Updated on Aug 20 2026 7:20 AM

మడకశిర: పొలంలో బోరు తవ్వకుండా అధికారులు అడ్డుకోవడంతో ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...మడకశిర మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ తన వ్యవసాయ భూమిలో బుధవారం బోరు వేయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బోరు లారీ కూడా వచ్చి పని కూడా ప్రారంభించింది. అయితే రత్నమ్మ వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి బోరు బావి తవ్విస్తున్నారని గ్రామానికి చెందిన కొందరు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే గుడ్డంపల్లికి చేరుకుని బోరుబావి తవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో రత్నమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. కుమారుడు సూర్యనారాయణరెడ్డి, కోడలు తదితర కుటుంబసభ్యులతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకుంది. వారి సమక్షంలోనే కార్యాలయం ఎదుటే పురుగుల మందు తాగింది. గమనించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆమె వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. వెంటనే 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, అధికారుల చర్యలను రత్నమ్మ కుమారుడు సూర్యనారాయణరెడ్డి తప్పుపట్టారు. తమ గ్రామంలో చాలా మంది బోరు బావులు తవ్వించారని, వారెవరినీ అడ్డుకోని అధికారులు వాల్టా చట్టం పేరుతో తమను మాత్రం అడ్డుకోవడం అన్యాయమన్నారు. కళ్లముందే పంటలు ఎండిపోతుండటంతో పొలంలో బోరు వేయించుకుంటుంటే అడ్డుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా పనిచేస్తున్నామని చెప్పుకునే అధికారులు తమ గ్రామంలో వాల్టాచట్టాన్ని అతిక్రమించి ఇప్పటికే వేసిన బోర్లన్నీ సీజ్‌ చేయాలన్నారు.

బోరు తవ్వకుండా అధికారులు

అడ్డుకున్నారని ఆవేదన

తహసీల్దార్‌ కార్యాలయం

ఎదుట ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement