అనంతపురం అర్బన్: ప్యానల్ సంవత్సరం 2018–19 నుంచి 2024–25 వరకు ఉన్న రెగ్యులర్, ప్రోహిబిషన్ డిప్యూటీ తహసీదార్ల (డీటీల) ముసాయిదా సమీకృత సీనియారిటీ జాబితాను సీసీఎల్‌ఏ జయలక్ష్మి బుధవారం విడుదల చేశారు. జోన్–4కు సంబంధించి ఈ ప్యానెల్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 94 మంది డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22వ తేదీలోగా సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిప్యూటీ తహసీల్దార్ల సీనియారిటీ ప్రకారం ఖాళీలను బట్టి తహసీల్దారుగా పదోన్నతి కల్పిస్తారు.
ప్రయాణికులకు మెరుగైన
సౌకర్యాలు: జీఆర్‌ఎం
ధర్మవరం: రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని దక్షిణ తీర రైల్వే జీఆర్‌ఎం సందీప్‌మాథుర్ తెలిపారు. బుధవారం ఆయన ధర్మవరం స్టేషన్‌ను తనిఖీ చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ధర్మవరం రైల్వేస్టేషన్ ఇటీవలే విశాఖపట్నం జోన్‌లో విలీనమై దక్షిణ తీర రైల్వే పరిధిలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో దక్షిణ తీర రైల్వే జీఆర్‌ఎం సందీప్‌మాతూర్ వివిధ స్టేషన్‌లలో సౌకర్యాలు, సమస్యలు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ధర్మవరం వచ్చిన ఆయన... అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన పనులు పరిశీలించారు. రైల్వేస్టేషన్‌లోని ఎస్‌ఎంఆర్ గది, విశ్రాంత గది, వెయిటింగ్ గది, స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన చేనేత విగ్రహాన్ని పరిశీలించారు. ఆటో పార్కింగ్, ఎలక్ట్రికల్ స్విచ్‌రూమ్ తదితర వాటిని సందర్శించారు. అనంతరం రైల్వేస్టేషన్‌లోని సమస్యలపై స్టేషన్ మేనేజర్ చల్లా నరసింహ నాయుడును అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీసీఓఐఎం వినీత్‌కుమార్, డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్త, సీనియర్ డీఓఐఎం దినేష్‌కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ బాలాజీ కిరణ్, డీఓఐఎం జనరల్ పూర్ణచంద్రరావు, సీసీఐ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


