● టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ
● తమ ప్లాట్లను పరిరక్షించాలని
బాధితుల వేడుకోలు
హిందూపురం: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ నాయకుల అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలకు అంతేలేకుండా పోతోంది. ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే కై వసం చేసుకుంటున్న అధికార పార్టీ నాయకులు తాజాగా ఓ లేఅవుట్‌కు ఎసరు పెట్టారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు పైసాపైసా పోగుచేసుకుని కొనుగోలు చేసిన స్థలాలకు సొంతం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే...
హిందూపురం మండలంలోని కిరికెర గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 215/4లోని 5.14 ఎకరాల భూమిలో హక్కుదారుడైన నాగరాజు అనే వ్యక్తి భవాని పేరుతో లేఅవుట్ వేశాడు. దీంతో 60 మంది అక్కడ ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆ లేఅవుట్‌పై కన్నేసిన అధికార పార్టీకి చెందిన నాయకులు ఇటీవల దౌర్జన్యం ఆ లేవుట్‌లో ప్రవేశించారు. ప్లాట్ల హద్దురాళ్లను తొలగించి జేసీబీ యంత్రంతో స్థలాన్ని చదును చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు బుధవారం లేఅవుట్ వద్ద ఆందోళన దిగారు. ఈ సందర్భంగా బాధితులు రామకృష్ణ, సుబ్బు, వెంకటేషబాబు, అక్కాయమ్మ, నరసింహమూర్తి, కిరణ్, నరసింహారెడ్డి, మారుతిరెడ్డి తదితరులు మాట్లాడారు. తాము తినీతినక మిగిలించుకున్న డబ్బుతో భవాని లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేశామని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. లేఅవుట్‌కు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయన్నారు. కబ్జాదారుల నుంచి తమ ప్లాట్లు కాపాడాలని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.


