పెనుకొండ రూరల్ (సోమందేపల్లి): చేనేత కార్మికులకు అన్ని అర్హతలు ఉన్నా నేతన్న నేస్తం పథకం వర్తింపజేయకపోవడం సరికాదని సీపీఐ నేతలు మండిపడ్డారు. అర్హులకు నేతన్న నేస్తం వర్తింపజేయలేదంటూ సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చేనేత కార్మికుల ఎంపిక పారదర్శకంగా జరగలేదన్నారు. మండల వ్యాప్తంగా 500 చేనేత మగ్గాలు ఉండగా, దాదాపుగా 800 మందికి నేతన్న నేస్తం పథకం ఎలా అమలు చేశారో చెప్పాలన్నారు. ఒకే సచివాలయంలో 600 మందిని అర్హులుగా నిర్ధారించడం ఎలా సాధ్యమైందో అధికారులు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపుగా 150 మంది చేనేతలకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పథకం వర్తింజేయలేదన్నారు. ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ ప్రేమ్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాలస్వామి, గంగరాజు, శ్రీకాంత్, చేనేత సంఘం నాయకులు నారాయణస్వామి, దాసరి సుధాకర్, శ్రీనివాసులు, అఽశ్వర్థ తదితరులు పాల్గొన్నారు.


