● రద్దు చేయాలని ఆర్డీఓకు గ్రామస్తుల వినతిపత్రం
అగళి: మండల పరిధిలోని నరసబుంది గ్రామంలో కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్రమంగా పాసు పుస్తకాలు పొందారని గ్రామస్తులు ఆరోపించారు. ఆ పట్టాలను రద్దు చేయాలని కోరుతూ సోమవారం మడకశిరలో ఆర్డీఓ నాగప్రసన్నలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. సర్వే నంబర్ 92–1లో 41.65 ఎకరాల్లోని చెరువు పాత కట్టకు చెందిన ప్రభుత్వ భూమికి 50 ఏళ్ల క్రితం పట్టాలిచ్చినట్లు కొందరు చెబుతున్నారన్నారు. సదరు భూమిలో ప్రస్తుతం గ్రామ సచివాలయం, చెత్త సంపద కేంద్రం, పశువుల తాగునీటి తొట్టెతో పాటు పంచాయతీకి చెందిన మూడు తాగునీటి బోరు బావులు ఉన్నాయన్నారు. భూములకు పట్టా పొందినప్పటి నుంచి పట్టాదారులు ఎవరూ సాగు చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో పట్టాలు రద్దు చేసి గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విచారణ చేసి నివేదికలు పంపించాలని ఆర్డీఓ నాగప్రసన్న లక్ష్మి స్థానిక అధికారులను ఆదేశించారు.


