పెనుకొండ రూరల్: భక్తుల కోరిన కోర్కెలు తీర్చే దైవంగా బెహలూల్ షా బాబా కీర్తిగడించారు. పెనుకొండ పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన బెహలూల్ షా ఖాద్రీ షాహీద్ దర్గా ఉంది. సర్వమత సమైక్యతకు ప్రతీకగా ఈ ప్రాంతం విరాజిల్లుతోంది. మంగళవారం నుంచి స్వామి వారి ఉరుసు ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.
ఇరాన్ నుంచి
ఇండియాకు....
బెహలూల్ షా బాబా ఇరాన్ దేశంలోని సిస్తాన్ పట్టణానికి చెందిన వారు. ఆధ్యాత్మిక మార్గంలో గురు ఆజ్ఞానసారంగా భారతదేశానికి వచ్చి మత సామరస్యానికి కృషి చేసినట్లు దర్గా నిర్వాహకులు చెబుతున్నారు. ఎన్నో మహిమలు కూడా చేసి చూపించారంటున్నారు. 1197లో బాబా పెనుకొండ అటవీ ప్రాంతం సమీపంలో సమాధి అయ్యారు. బెహలూల్ షా బాబాను బెల్లాల్ సాబ్, జలాల్ సాబ్ అని కూడా పిలుస్తుంటారు. అప్పట్లో దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో దారి దోపిడీ దొంగలు, క్రూర మృగాల దాడులు ఎక్కువగా జరిగేవి. బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఈ రహదారి గుండా వెళ్లాలంటే వణికిపోయేవారు. ఎద్దుల బండ్లు, గుర్రాలపై వెళ్లే వర్తకులతో పాటు ప్రయాణికులు కచ్చితంగా బాబా సమాధిని దర్శించుకొని ప్రార్థనలు చేసి వెళ్లేవారు. ఇలా చేయడం వల్ల ఏ ప్రమాదాల బారిన పడకుండా ఉండటంతో పాటు కుటుంబాలు సంతోషంగా ఉంటాయని భక్తుల నమ్మకం. అలాగే వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చిన అనేక మంది వర్తకులు పెద్ద ఎత్తున ఇక్కడి వచ్చి స్వామివారికి మొక్కలు చెల్లిస్తుంటారు. జాతీయ రహదారిపై భక్తులను రోడ్డు ప్రమాదాల నుంచి అనేకసార్లు కాపాడినట్లు భక్తులు చెబుతుంటారు.
44వ జాతీయ రహదారి పక్కనున్న బెహలూల్ షా బాబా దర్గా
బాబా సమాధి
రేపటి నుంచి ఉరుసు ఉత్సవాలు
విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి షెక్షావలి పిలుపు
రేపు జెండా ఉత్సవం
బెహలూల్ షా బాబా ఉరుసు ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 11న జెండా ఉత్సవం, 12న గంధం వేడుక, 13న దీపారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు దర్గా పీఠాధిపతి ఆదోని షెక్షావలి తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉరుసు ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు అన్నదానం, ప్రసాదాల పంపిణీ చేస్తామన్నారు.


