గోరంట్ల: మండల పరిధిలోని పులేరు శివారులో జూదమడుతున్న 8 మందిని ఆదివారం అరెస్టు చేసినట్లు సీఐ బోయశేఖర్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.21,350 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రేమ పేరుతో మోసం
● యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముదిగుబ్బ: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన ముక్తాపురం ఓబుళపతి అనే యువకుడు ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఈ నెల 3న తెల్లవారుజామున బైక్‌పై అనంతపురం, అక్కడి నుంచి కారులో బెంగళూరుకు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైందని సీఐ శివరాముడు తెలిపారు. బెంగళూరులో వివాహం చేసుకున్నట్లు చెప్పి మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. తరువాత బాలికను ముదిగుబ్బ బస్టాండ్ వద్ద వదిలివేయగా ఆమె నేరుగా ముదిగుబ్బ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన విషయాన్ని తెలిపిందన్నారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం కృష్ణాపురం క్రాస్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అతని వద్ద ఉన్న బైకును సీజ్ చేశామన్నారు.
మహిళకు తీవ్రగాయాలు
బత్తలపల్లి: అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని బత్తలపల్లి బైపాస్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితుల వివరాలమేరకు.. మండలంలోని తిమ్మనకొట్టాలకు చెందిన శేఖర్, రామాంజినమ్మ దంపతులు ఆదివారం గ్రామం నుంచి అనంతపురంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి ద్విచక్ర వాహనంలో వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత స్వగ్రామానికి బయలుదేరారు. బత్తలపల్లి దాటిన అనంతరం బైపాస్‌లోకి ప్రవేశించే సమయంలో బత్తలపల్లికి మిరపకాయలు మూటలతో వస్తున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని దాటే సమయంలో ఆటోలో వేలాడుతున్న మూటలు రామాంజినమ్మను తాకడంతో ఆమె కిందపడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే ఆమెను ఆర్డీటీ ఆస్పత్రికి మరో ఆటోలో తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.


