కదిరి టౌన్: విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండటంతో పాటు సమాజాన్ని చైతన్య పర్చాలని ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం కుటాగుళ్ల సమీపంలోని ఓబుళేశ్వర అకాడమీలో పోలీస్‌శాఖ ఏర్పాటు చేసిన ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్తు, కుటుంబ గౌరవం నాశనమవుతాయని గుర్తుంచుకోవాలన్నారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు స్పష్టమైన లక్ష్యం, క్రమశిక్షణ ఉన్నందున డ్రగ్స్‌పై అవగాహన మాత్రమే కాకుండా చట్టపరమైన పరిజ్ఞానం అవసరమని సూచించారు. దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఎస్సీ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గర్‌ల్స్ కమాండోలు అందించిన గార్డ్ ఆఫ్ హానర్, డ్రిల్ ఫార్మేషన్స్ చూసి ఎస్పీ వారిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎలైట్ భద్రతా దళాలు, విదేశీ శిక్షణా విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు బి.వెంకటేశ్వర్లు, నిరంజన్‌రెడ్డి, నాగేంద్ర, ఎస్‌ఐ బాబ్జాన్, అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.
యువతకు ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపు
ఎన్‌డీపీఎస్ చట్టంపై అవగాహన
ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ పరిశీలన..
పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను శుక్రవారం సాయంత్రం ఎస్పీ సతీష్‌కుమార్ పరిశీలించారు. ఫిర్యాదుదారులకు అందుతున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలు, కేసులు పరిష్కార ప్రక్రియ గురించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కౌన్సెలింగ్ సెంటర్ నిర్వహణ, రికార్డులు, కేసుల పురోగతిని పరిశీలించి అధికారులకు తగు సూచనలు, సలహాలు అందించారు.


