● జేసీ మౌర్యభరద్వాజ్
గాండ్లపెంట: రైతు భూమిపై సర్వ హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూ రీసర్వే చేసి పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తోందని జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని వేపరాల పంచాయతీ కేంద్రంలో పంచాయతీకి సంబంధించిన 448 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకాలతో రైతుకు ఆ భూమిపై సర్వ హక్కులు సంక్రమిస్తాయన్నారు. రైతులు భూ రీసర్వేపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం కొందరు రైతులకు జేసీ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కదిరి ఆర్డీఓ కళావతి, తహసీల్దార్ నరసింహులు, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు
గాండ్లపెంట: అమరావతి చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా జిల్లాస్థాయి క్రీడా పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నట్లు కదిరి నియోజకవర్గ క్రీడల కోఆర్డినేటర్ హరిప్రసాద్ తెలిపారు. ఈ నెల 7న బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు పెనుకొండ కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతాయన్నారు. అలాగే 11న ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు హిందూపురం సమీపంలోని బసవనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 12న హాకీ, ఆర్చరీ, యోగా, బాక్సింగ్, చెస్, బాస్కెట్‌బాల్ పోటీలు ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ నిర్వహిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గస్థాయి క్రీడల్లో ఎంపికై న క్రీడాకారులు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనాలని సూచించారు.
హైరిస్క్ గర్భిణుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి
పుట్టపర్తి అర్బన్: హైరిస్క్ ఉన్న గర్భిణుల ఆరోగ్యంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం పేర్కొన్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంపై గురువారం హైరిస్క్ గర్భిణుల కేసులు ఎలా గుర్తించాలి, ప్రాథమిక చరిత్ర తదితర వాటిపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ గర్భిణులను కంటికి రెప్పలా చూసుకోవాలన్నారు. గర్భిణీగా నమోదైనప్పటి నుంచి ఆమెకు వచ్చే వ్యాధులు, ఉన్న వ్యాధులను పూర్తిస్థాయిలో గుర్తించాలన్నారు. గర్భిణులను రక్షించుకోగలిగితే శిశువులను సురక్షితంగా ప్రసవం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాల జిల్లా అధికారి చెన్నారెడ్డి, ఆర్మన్ సంస్థ ప్రతినిధి చరణ్ తేజ్, వైద్యాధికారులు గాయత్రి, దీప్తి రెడ్డి, ప్రోగ్రాం అధికారులు సునీల్, పద్మజ, డీపీఎం నాగరాజు, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, సీహెచ్‌ఓ వన్నప్ప తదితరులు పాల్గొన్నారు.
అప్పు చెల్లించాలన్నందుకు
వ్యక్తిపై దాడి
ముదిగుబ్బ: మండల కేంద్రమైన ముదిగుబ్బకు చెందిన బీసీ కురుబ మునిస్వామిపై సొంత చెల్లెలు కుటుంబ సభ్యులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు మునిస్వామి వివరాల మేరకు.. తన చెల్లెలు లక్ష్మీ టీ హోటల్ నిర్వహించుకునేందుకు సుమారు 20 నెలల క్రితం రూ.30 వేలు అప్పుగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తన కుమారుడి కళాశాల ఫీజులు చెల్లించాల్సి ఉండటంతో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అయితే తన చెల్లెలి భర్త రవి, కుమారుడు హేమంత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు చంపేస్తామని ఫోన్‌లో బెదిరించారన్నారు. అనంతరం బుధవారం రాత్రి ఐదుగురు వ్యక్తులతో కలిసి వచ్చి విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపారు. దాడిలో తన కాలు, చేయి, ఉంగరపు వేలు విరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన మునిస్వామిని కుటుంబ సభ్యులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మునిస్వామి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


