సాక్షి, పుట్టపర్తి: రాష్ట్రంలోనే అతి పెద్ద చింతపండు మార్కెట్ హిందూపురం పట్టణంలో ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఏటా వేల టన్నుల చింతపండు వస్తుంది. నిల్వ చేసేందుకు వీలుగా హిందూపురంలో ఏడు శీతల గిడ్డంగులు (కోల్డ్ స్టోరేజీ) వెలిశాయి. గిడ్డంగుల్లో నిల్వ ఉంచేందుకు 30 కిలోల బస్తాకు రూ.80 చొప్పున చెల్లించాలి. ఓసారి చెల్లిస్తే ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చు. చిన్న గిడ్డంగుల్లో 300 టన్నులు, పెద్ద వాటిలో అయితే 500 టన్నుల చింతపండు నిల్వ ఉంచుతారు. హిందూపురంలోని గిడ్డంగులన్నీ 70 శాతం పైగా చింతపండుతో నిండిపోయాయి. రికార్డుల ప్రకారం 2 వేల టన్నుల పైగా గిడ్డంగుల్లోనే ఉంది.
కానరాని గిట్టుబాటు
పంట పండినా ‘చింత’ తీరలేదన్నట్లు పరిస్థితి తయారైంది. అధికంగా దిగుబడి రావడంతో రేట్లు ఉన్నఫళంగా పడిపోయాయి. దీంతో రైతుల నుంచి వ్యాపారులు తక్కువ ధరలకే సరుకు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఎక్కువ సరుకు ఉండటంతో ఎగుమతి చేసేందుకు కుదరలేదు. దీంతో సరుకును శీతల గిడ్డంగుల్లోకి చేర్చారు. ఏడాదికి కొంత మొత్తం రుసుం చెల్లించి గిడ్డంగుల్లో నిల్వ ఉంచారు. చింతపండుతో హిందూపురంలోని శీతల గిడ్డంగులన్నీ నిండిపోయాయి. గిట్టుబాటు ధర వచ్చే వరకు గోదాముల్లో ఉంటుంది. అప్పటి వరకు వ్యాపారులు వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో రైతులకే కాదు.. తమకు కూడా గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో విదేశాలకు ఎగుమతి చేసే వాళ్లమని, ఈ సారి సరుకు ఎక్కువగా ఉండటంతో స్థానికంగా నిల్వ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. దేశంలోనే ప్రాసెసింగ్ యూనిట్‌లు ఏర్పాటు చేస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
గిట్టుబాటు వచ్చాకే అమ్మకాలు
హిందూపురంలోని చింతపండు శీతల గిడ్డంగులన్నీ ఫుల్
రెండువేల టన్నులకు పైగా నిల్వ
గిట్టుబాటు ధరల్లేవంటూ నిట్టూరుస్తున్న వ్యాపారులు
తమకూ లాభాలు దక్కలేదంటున్న రైతులు
హిందూపురం మార్కెట్‌లో చింతపండు (ఫైల్)


