చిలమత్తూరు: హిందూపురాన్ని మీ పీఏలు దోచేస్తున్నా పట్టదా?అంటూ ఎమ్మెల్యే బాలకృష్ణను వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక నిలదీశారు. నియోజకవర్గంలో ఆదివారం ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో ఆయన పీఏలు, టీడీపీ నేతల కబ్జాలను బయట పెట్టాలనే ఉద్దేశంతో దీపిక పోరుబాటకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేళ్లుగా ఎమ్మెల్యే పీఏలు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పీఏల ప్రోద్బలంతో ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్, టీడీపీ నాయకుడు మల్లికార్జున కొట్నూరు చెరువు పొరంబోకు భూమిలో రెండెకరాలు ఆక్రమించి అక్రమంగా బోరు వేసుకొని పంటల సాగు చేస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీ అనధికారికంగా మద్యం దుకాణం నడుపుతుండడమే కాకుండా కల్తీ మద్యం విక్రయిస్తూ పేద ప్రజల జీవితాలతో ఆడుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ తతంగమంతా బాలకృష్ణకు తెలియకుండా జరుగుతోందా అని ప్రశ్నించారు. కొట్నూరు పొలంలో ఎకరా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా షెడ్‌లు ఏర్పాటు చేశారని, కోర్టులు మొట్టికాయలు వేసినా మున్సిపల్ అధికారుల్లో చలనం లేదన్నారు. ప్రస్తుత కమిషనర్ మల్లికార్జున, మాజీ కమిషనర్ సంగం శ్రీనివాసులుకు నోటీసులిచ్చినా అక్రమ నిర్మాణాలను తొలగించకపోవడం చూస్తే ఎమ్మెల్యే, ఆయన పీఏల ప్రోద్బలంతోనే ఈ వ్యవహారం అంతా నడుస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ఈ దుర్మార్గాలను ఇకపై సహించబోమన్నారు. ఒక రోజు గడువు ఇస్తున్నామని, అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే అంబేడ్కర్ సాక్షిగా హిందూపురంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. సంపద సృష్టి అంటే ఇలాంటి దగాకోరు పనులు చేయడమేనా అని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కురుబ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్‌ఏ శివ, బూత్ లెవెల్ జోన్ –5 వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామ్మూర్తి, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి శంకరయ్య, మైనారిటీ విభాగం రాష్ట్ర నేత ఆసిఫుల్లా, బూత్ లెవెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరుణ్‌రెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఫారూఖ్, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, మాజీ కౌన్సిలర్లు షాజియా, దాదూ, మహేష్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చెర్మన్ జబీఉల్లా, చిలమత్తూరు హిందూపురం, లేపాక్షి మండలాల కన్వీనర్లు రామకృష్ణారెడ్డి, రాము, సయ్యద్ నిస్సార్, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఓ పీఏ అక్రమ మద్యం దుకాణం
నడుపుతుండడం కనపడటం లేదా?
ఎమ్మెల్యే బాలకృష్ణను నిలదీసిన వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దీపిక


