నేడు ‘పరిష్కార వేదిక’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘పరిష్కార వేదిక’

Jul 13 2026 4:25 AM | Updated on Jul 13 2026 4:25 AM

పుట్టపర్తి టౌన్‌: స్థానిక పోలీస్‌ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్‌ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు.

టీబీ డ్యాంలో

23 టీఎంసీల నీరు

బొమ్మనహాళ్‌: తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం 23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శుక్రవారం 44,782 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో ఆదివారం నాటికి 25,120 క్యూసెక్కులకు తగ్గింది. తుంగభద్ర రిజర్వాయర్‌ పూర్తి సామర్ధ్యం 1633 అడుగులకు గాను 1601.08 అడుగుల మేర నీటిమట్టం ఉంది. డ్యాం నీటి నిల్వ పూర్తి సామర్ధ్యం 105.788 టీఎంసీలకు గాను 23 టీంఎసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 25,120 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 381 క్యూసెక్కులు ఉంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1625.13 అడుగులతో 76.91 టీఎంసీల నీరు నిల్వ ఉండి.. 46,579 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 36,026 క్యూసక్కుల నీటిని గేట్లు ఎత్తి నదికి వదిలారు.

అటవీ శాఖ సిబ్బంది దౌర్జన్యం

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అటవీ శాఖ సిబ్బంది తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన నగరవనం పార్కును పర్యవేక్షించాల్సిన సిబ్బంది తమ బాధ్యతలను విస్మరించి సందర్శకుల పట్ల నిర్లక్ష్యంగా, దురుసుగా ప్రవర్తిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో నగరవనానికి వందలాది మంది సందర్శకులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. అయితే నిర్దేశిత సమయం కంటే ముందే అటవీ శాఖ సిబ్బంది టికెట్‌ కౌంటర్‌ను మూసేశారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి పిల్లలతో కలిసి వచ్చిన సందర్శకులు తీవ్ర నిరాశ చెందారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం..అధికారులు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకపోవడంతో వందలాది మంది నగరవనం బయటే పడిగాపులు కాశారు. రోజుకు రెండు వేల టికెట్లు మాత్రమే ఇస్తామని అటవీ శాఖ సిబ్బంది చెప్పడంతో మిగిలినవారు నిరాశతో వెనుదిరిగారు.

సందర్శకులపై దూషణలు

ముందస్తుగానే టికెట్లు ఎందుకు క్లోజ్‌ చేశారంటూ ప్రశ్నించిన యువకులపై అటవీ శాఖ సిబ్బంది నోరు పారేసుకున్నారు. బూతు పురాణం అందుకోవడమే కాకుండా ‘వీడియో కాకపోతే ఏమైనా రికార్డు చేసుకో..ఎవ్వరికి పంపుతావో పంపుకో..భయపడేది లేదు..మీకు చేతనైంది చేసుకోండి’ అంటూ దౌర్జన్యానికి దిగారు. ఒక దశలో బీట్‌ ఆఫీసర్‌ నాగే నాయక్‌ తన ప్యాంట్‌ బెల్టు ఊడదీసి సందర్శకులను కొట్టేందుకు వెళ్లారు. ఆయన తీరుపై సందర్శకులు మండిపడ్డారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

రాయదుర్గంటౌన్‌: పట్టణంలోని ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాగునీరు అందించి ఆదుకోవాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో తరచూ ఏదో ఒక ప్రాంతంలో ధర్నాలు, నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. తాజాగా ఆదివారం పట్టణంలోని కోతిగుట్ట, డ్రైవర్స్‌ కాలనీ వద్ద అనంతపురానికి వెళ్లే ప్రధాన రహదారిపై మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేసి నిరసన తెలియజేశారు. వారం రోజులు గడిచిపోయినా కొళాయిలకు నీరు సరఫరా చేయకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు వదిలినా రాత్రిపూట వదులుతారని, అవి కూడా అరగంట పాటు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకోతో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న నీటి సరఫరా విభాగం సిబ్బంది అక్కడికి చేరుకుని నీరుసక్రమంగా విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement