హిందూపురం: రాష్ట్ర సరిహద్దులోని కొటిపి గ్రామంలో గ్రామదేవతగా కొలువై కర్ణాటక, ఆంధ్ర తమిళనాడు, తెలంగాణ రాష్ల్రా భక్తుల పాలిట కొంగు బంగారమై చౌడేశ్వరీ అమ్మవారు పూజలందుకుంటోంది. సుమారు ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తులు పోటెత్తుతుంటారు. కొటిపి చౌడేశ్వరీ దేవి అంటే సత్య వాక్కు కలిగిన అమ్మవారిగా భక్తుల విశ్వాసం. ఎలాంటి దుష్ట పీడలైనా దూరం చూసే శక్తిస్వరూపిణిగా కొలుస్తుంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో విశేష పూజలు జరుగుతుంటాయి. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి వడిబియ్యం సమర్పిస్తుంటారు. జంతు బలులతో మొక్కులు తీర్చుకుంటారు. ఆలయం ఆవరణలోని చెరువు కట్టపై జంతు బలులు చేస్తుంటారు. అయితే బలిదానం చేసినప్పుడు రక్తఽధారలు భూమిలోనే ఇంకిపోతాయని, అవి కనిపించవని పూర్వీకులు చెబుతున్నారు.
ఎంతటి విలువైన చీరైనా సరే..
మొక్కుబడుల్లో భాగంగా కొటిపి చౌడేశ్వరీదేవి అమ్మవారికి వడిబియ్యంతో పాటు సమర్పించిన ఎంతటి విలువైన చీరయినా సరే ఒక్కసారి అమ్మవారి మూలవిరాట్‌కు అలంకరించి ఆ తర్వాత తీసి చెరువు కట్టపై వదిలేస్తారు. అది ఎంతటి విలువైన చీరయినా దానిని ఎవరూ ముట్టరు. అలా భక్తులు సమర్పించిన చీరలు చెరువు కట్టపై గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ఇందుకు బలమైన పూర్వ కథనం ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ‘వందల ఏళ్ల నాటి క్రితం అమ్మవారికి కానుకల రూపంలో భక్తులు సమర్పించిన చీరలను విక్రయించాలని నిర్ణయించుకున్న గ్రామస్తులు ఓ వ్యాపారిని సంప్రదిస్తారు. అతను ఖరీదైన చీరలను తీసి కట్ట కట్టి మరుసటి రోజు వచ్చి తీసుకెళతానని చెప్పి వెళతాడు. గ్రామ పొలిమేర దాటగానే ఉన్నఫళంగా తీవ్ర అస్వస్థతకు గురై కాలు కూడా కదపలేని స్థితిలో అక్కడే చతికిల పడిపోయిన వ్యాపారిని గమనించిన గ్రామస్తులు వెంటనే అమ్మవారి మహిమగా నిర్ధారించుకుని ఆలయానికి చేరుకుని చౌడేశ్వరీదేవిని శరణు కోరుతారు. వ్యాపారి కట్టలు కట్టిన చీరలను తీసి అమ్మవారి మూలవిరాట్ ఎదుట పెడతారు. ఆశ్చర్యంగా అదే రోజు వ్యాపారి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆ రోజు రాత్రి వ్యాపారి కలలో అమ్మవారు కనిపించి తాను కట్టిన చీర ఎవరూ తీసుకెళ్లరాదని చెప్పడంతో ఉదయాన్నే వ్యాపారి కొటిపి గ్రామానికి చేరుకుని అమ్మవారి మహత్యాన్ని గ్రామస్తులకు తెలుపుతాడు. అప్పటి నుంచి అమ్మవారికి సమర్పించిన చీరలను ముట్టడానికి ఎవరూ సాహించడం లేదు.’
నేడు రథోత్సవం
హిందూపురం మండలం కొటిపి గ్రామంలో వెలసిన చౌడేశ్వీరీదేవి అమ్మవారి బ్రహ్మ రథోత్సవం శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు గురువారం వెల్లడించారు. ఏటా ఉగాది పండుగ సందర్భంగా మూలవిరాట్‌కు ప్రత్యేకపూజలు, ప్రాకార ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాగే మంగళ, శుక్రవారాల్లో బ్రహ్మ రథోత్సవాన్ని నిర్వహించడం అనావాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 20న రథోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను గ్రామస్తులు పూర్తి చేశారు.
కొలిచిన వారి కొంగుబంగారమై విరాజిల్లుతున్న కొటిపి చౌడేశ్వరీ దేవి
సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామిని, నిగర్భయోగిని.. ... అంటూ ఒక్కసారి చౌడేశ్వరీ ఖడ్గమాలను పఠిస్తే అభీష్ట సిద్ధితో పాటు సమస్త పీడలు దూరమవుతాయి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆనందం సొంతమవుతాయి. ఛైత్ర మాసం రాకతో జిల్లాలో శక్తి స్వరూపిణి ఆరాధనలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సమస్త దేవతా స్వరూపంగా భక్తులు కొలిచే కొటిపిలోని చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో మొదలయ్యాయి.


