పరిగి: పురుగుల మందు తాగిన ఘటనలో చికిత్స పొందుతున్న చేనేత కార్మికుడు కురుబ మల్లికార్జున (34) పరిస్థితి విషమించడంతో శుక్రవారం చనిపోయాడు. ఎస్‌ఐ రంగడు యాదవ్ వివరాలమేరకు.. హిందూపురం పరిధిలోని ధన్‌రోడ్డులో నివాసముంటున్న మల్లికార్జున చేనేత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలన్న ఉద్దేవంతో తెలిసిన వారితో సుమారు రూ.8 లక్షలు అప్పులు చేశాడు. అవి తీర్చలేని పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ నెల 5న ఇంటి నుంచి బయటకు వచ్చాడు. పరిగి మండలంలోని హొన్నంపల్లి సమీపంలో పరిగి చెరువులోని కంపచెట్ల వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు. స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని వెంటనే హిందూపురం ఆస్పత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.


