పుట్టపర్తి అర్బన్: ముదిగుబ్బ నుంచి కోడూరు వరకూ పుట్టపర్తి మీదుగా నూతనంగా ఏర్పాటవుతున్న జాతీయ రహదారి 342 ప్రమాదాలకు అడ్డాగా మారింది. 80 కిలో మీటర్ల రోడ్డు వెంబడి ఉన్న ప్రమాదకర మలుపులు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయిన నిర్మాణ పనులు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న వంకలకు రక్షణ ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతుండగా తీవ్రగాయాలతో అల్లాడిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
జాతీయ రహదారి 342 పనులు పూర్తికాకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామాల నుంచి సర్వీస్ రోడ్ల వెంబడి ప్రయాణించి జాతీయ రహదారిపైకి వచ్చే జంక్షన్లు, సర్వీస్ రోడ్ల అభివృద్ధి అధికారులు పూర్తిగా విస్మరించారు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా జాతీయ రహదారిపైకి వాహనం ఎక్కిస్తే వాయువేగంతో వచ్చే వాహనాలతో పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. టోల్‌గేట్ పనులు నత్తనగకన సాగుతున్నాయి. గోరంట్ల వద్ద ఫ్‌లైవర్ బ్రిడ్జి పనులు పూర్తి కావాల్సి ఉంది. మూడవ విడతలో భాగంగా పుట్టపర్తి సమీపంలో బ్రిడ్జిల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. రోడ్డు పనులు ప్రారంభమై మూడేళ్లు పూర్తయినా నేటికీ సంపూర్తిగా చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు పట్టించుకోకపోవడంతోరీ దుస్థితి నెలకొందని వాహనదారులు వాపోతున్నారు.
● గత బుధవారం రాత్రి బెంగళూరు నుంచి పుట్టపర్తికి వస్తున్న కారు వేగంగా వస్తూ కొత్తచెరువు మండలం కదిరేపల్లి పొలం వద్ద భారీ గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో సత్యసాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పుట్టపర్తికి చెందిన రిజ్వాన్ బాషా (48) మృతి చెందగా ఆయన భార్య సర్తాజ్ తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రాణాపాయస్థితిలో ఉంది. డ్రైవర్ చాంద్‌బాషా కూడా తీవ్రంగా గాయపడ్డారు.
● ఇటీవల బెంగళూరు నుంచి పుట్టపర్తికి కారులో వస్తున్న ఇద్దరు సత్యసాయి బాబా విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు టోల్ గేట్ వద్ద ఉన్న మట్టి కుప్పపై కెక్కి బోల్తా పడ్డారు. ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలయ్యారు.
● అలాగే కంకర తీసుకొస్తున్న టిప్పర్ ఢీ కొని గువ్వలగుట్టపల్లికి చెందిన ఓ వ్యక్తికి రెండు కాళ్లు విరిగాయి.
● జాతీయ రహదారి నిర్మాణంతో పాటు సర్వీస్ రోడ్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో నాలుగు నెలల క్రితం పెడపల్లి వద్ద జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్డుపైకి వచ్చే క్రమంలో జరిగిన ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన రెండు కుటుంబాల్లో పెను విషాదం నింపింది.
● ఆరు నెలల క్రితం పెద్దతండా వద్ద ఉన్న జంక్షన్ వద్ద ఆటో బోల్తాపడటంతో మహిళా కూలి మృతి చెందగా ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి.
● వెంకటగారిపల్లి వద్ద ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
● పనులు సరిగా పూర్తికాని కారణంగా కర్ణాటక బస్సు సైతం వెంకటగారిపల్లి వద్ద డివైడర్‌ను ఢీ కొని నిలిచిపోయింది.
● గోరంట్ల మండలం మందలపల్లి వద్ద జాతీయ రహదారిపై దంతులు వెళ్తున్న బైక్ అదుపు తప్పింది. వాహనం పడకపోయి ఉంటే లారీ కిందకు వెళ్లిపోయేదని, త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అధికారులు కనీసం ప్రమాద హెచ్చరికలు బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాలకు అడ్డాగా 342 హైవే
మూడేళ్లుగా సాగుతున్న పనులు
తరచూ ప్రమాదాల్లో
నిండు ప్రాణాల బలి
ఎంతో మంది గాయపడుతున్న వైనం
చోద్యం చూస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లు
ఏమరపాటుగా ఉంటే అంతే..
ప్రమాదాలు ఇలా...


