నిబంధనలకు పాతర | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు పాతర

Mar 14 2026 8:37 AM | Updated on Mar 14 2026 8:37 AM

శ్రీచైతన్య పాఠశాలల తనిఖీలో అధికారుల వెల్లడి

కదిరి: జిల్లాలోని కదిరి, గోరంట్లలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలను శుక్రవారం పెనుకొండ డిప్యూటీ డీఈఓ జాన్‌ రెడ్డెప్ప విచారణ చేపట్టారు. జిల్లాలోని శ్రీ చైతన్య పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారని కళ్యాణదుర్గానికి చెందిన రమణ అనే వ్యక్తి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ఫిర్యాదు చేయడంతో దానిపై విచారణ చేపట్టారు. అనంతరం జాన్‌ రెడ్డెప్ప మాట్లాడుతూ.. జిల్లాలోని కదిరితో పాటు గోరంట్లలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలను తనిఖీ చేశామని, జిల్లాలో ఇంకా రెండు శ్రీ చైతన్య పాఠశాలలు తనిఖీ చేయాల్సి ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ తరగతులు నిర్వహిస్తున్న మాట నిజమేనని, తమ విచారణలో కూడా బయట పడిందన్నారు. వాటిలో ప్రీ–ప్రైమరీ పాఠశాలలకు గుర్తింపు లేదనే విషయం తాము గుర్తించామన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ అక్కడ తరగతులు నిర్వహిస్తున్నారని, క్వాలిఫైడ్‌ టీచర్స్‌తో కాకుండా ఇంటర్‌, డిగ్రీ చదివిన వారితో పాఠాలు చెప్పిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే రకరకాల పేర్లతో అదనపు ఫీజులు కూడా వసూలు చేసినట్లు తమ విచారణలో బయటపడిందన్నారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. ఆయన వెంట కదిరి ఎంఈఓ చెన్నకృష్ణ ఉన్నారు.

జేసీని కలిసిన రెవెన్యూ సర్వీసెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రశాంతి నిలయం: ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు జేసీ మౌర్య భరద్వాజ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు మైనుద్దీన్‌, జిల్లా సెక్రెటరీ కళ్యాణ చక్రవర్తితో కలిసి శుక్రవారం కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా జేసీకి పుష్పగుచ్ఛం అందజేసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చక్రపాణి, మహబూబ్‌ బాషా, యశ్వంత్‌, సనత్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌, దివాకర్‌ , సోమశేఖర్‌ తదితరులు ఉన్నారు.

వివాహిత మృతిపై కేసు నమోదు

బత్తలపల్లి: మండల కేంద్రమైన బత్తలపల్లిలోని గురువారం ఆత్మహత్య చేసుకున్న వివాహిత శ్రీలక్ష్మి మృతిపై ఆమె తండ్రి బెల్లపుకొండ శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బత్తలపల్లి పోలీసులు తెలిపారు. బీసీ కాలనీకి చెందిన ఆలకుంట శ్రీనివాసులు భార్య శ్రీలక్ష్మి (20) గురువారం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందిన సంగతి పాఠకులకు తెలిసిందే. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

రైతుల సమస్యలు

పరిష్కరించాలి

అనంతపురం టవర్‌క్లాక్‌: రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ కోరారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జెడ్పీ స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, సీ్త్ర శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శివశంకర్‌, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య, జెడ్పీ స్థాయీ సంఘం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement