ధర్మవరం: ఇళ్లలో ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. ధర్మవరం పట్టణంలోని పలు హోటళ్లపైన శుక్రవారం రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. పట్టణంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో డొమెస్టిక్ సిలెండర్లు వాడుతున్నట్లు గుర్తించారు. ధర్మవరం ఆర్డీఓ రామసుబ్బయ్య, తహసీల్దార్ సురేష్‌బాబుల ఆదేశాల మేరకు సీఎస్‌డీటీ రమణబాబు, వీఆర్‌ఓ రవిల ఆధ్వర్యంలో హోటళ్లలో దాడులు నిర్వహించి 11 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. రెస్టారెంట్లు, హోటళ్లపై కేసులు నమోదు చేస్తున్నామని రెవెన్యూ అధికారులు తెలిపారు. గ్యాస్ గోడౌన్‌ను కూడా తనిఖీ చేసి రికార్డులు తనిఖీ చేయగా స్టాక్ రిజిస్టర్ లేదని గుర్తించామన్నారు. ఎవరైనా ఇంటికి ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌కు వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
పెనుకొండ రూరల్: అక్రమంగా డొమొస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న వాణిజ్య కేంద్రాల్లో రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంతో పాటు కియా పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. 19 డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. కేసులు నమోదు చేసి సిలిండర్లను గోడౌన్ తరలించారు. దాడులలో పౌరసరఫరాల డివిజన్ అధికారి రమేష్, తహసీల్దార్ స్వాతి, సీఎస్‌డీటీ ప్రభావతి, వీఆర్వో బషీర్ పాల్గొన్నారు.
హిందూపురం టౌన్: సివిల్ సప్లయ్స్ అధికారులు శుక్రవారం పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ హారతి ఆధ్వర్యంలో నాలుగు బృందాలు రెవెన్యూ సిబ్బంది పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తుండటంతో ఆయా హోటళ్ల యజమానులపై కేసులు నమోదు చేయడంతో పాటు 27 సిలిండర్లను సీజ్ చేసినట్లు డీటీ హారతి తెలిపారు. దాడుల్లో డీటీలు లక్ష్మీనరసింహం, సావిత్రి, అనిల్ కుమార్, విజయ నిర్మల, మోహన్ నాయక్, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.
భారీగా గ్యాస్ సిలిండర్ల సీజ్


