కొర్రీలు.. కోతలు | - | Sakshi
Sakshi News home page

కొర్రీలు.. కోతలు

Mar 14 2026 7:24 AM | Updated on Mar 14 2026 7:24 AM

కొర్రీలు...కోతలతో ‘అన్నదాత సుఖీభవ’ అర్హులకు అందకుండా పోయింది. ఈ–కేవైసీ చేయలేదని, బ్యాంకు ఖాతాకు ఎన్‌ీపీసీఐకి లింక్‌ కాలేదని, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని..ఇలా వివిధ కారణాలను సాకుగా చూపిన చంద్రబాబు సర్కార్‌ రైతుకు శఠగోపం పెట్టింది. గతంలో వైఎస్‌ జగన్‌ అందజేసిన రైతు భరోసాతో పోలిస్తే జిల్లాలోని సుమారు 20 వేల మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ అందని పరిస్థితి నెలకొంది. వరుస కరువులతో అల్లాడిపోతున్న రైతులను ఆదుకోవాల్సిన పాలకులు పెట్టుబడి సాయానికి కోత పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పుట్టపర్తి అర్బన్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ‘రైతు భరోసా’ పథకాన్ని కాపీ కొట్టి ‘అన్నదాత సుఖీభవ’ అంటూ పేరు మార్చిన చంద్రబాబు.. రైతుకు తోడుగా నిలవడంలో మాత్రం చిత్తశుద్ధి చూపలేకపోయారు. భూమి ఉన్న ప్రతి రైతుకూ ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏటా రూ. 20 వేలు అందజేస్తామని హామీ ఇచ్చినా.. మొదటి ఏడాదే రైతుకు మొండి చూపారు. ఇక రెండో ఏడాదిలోనూ ‘సుఖీభవ’ మొత్తాన్ని రూ.20 వేలకు బదులు రూ.14 వేలకే కుదించారు. అదికూడా ఖాతాల్లో జమ చేయలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా 2025 ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా ‘పీఎం కిసాన్‌’ ద్వారా వచ్చే రూ.2 వేలతో కలిపి రూ. 7 వేలు అందజేశారు. తిరిగి రెండో విడతలో నవంబర్‌ 19న మరో రూ.7 వేలు జమ చేశారు. ప్రస్తుతం మూడో విడతలో పీఎం కిసాన్‌తో కలిపి రూ.6 వేలు జమ చేశారు.

20 వేల మందికి అందని పెట్టుబడి సాయం..

పీఎం కిసాన్‌–అన్నదాత సుఖీభవ కింద గతంలో కన్నా రైతుల సంఖ్య పెరగాల్సి ఉన్నా... రకరకాల నిబంధనల పేరుతో జాబితాలను కుదించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కింద 2.79 లక్షల మందికి ఏటా పెట్టుబడిసాయం అందిస్తూ వచ్చారు. ఇపుడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అర్హుల సంఖ్య సుమారుగా 20 వేల వరకూ తగ్గిపోయింది. జిల్లాలో హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ ఆధారంగా ఒక కుటుంబంలో ఎంత మంది రైతులున్నా ఒకరికే ‘అన్నదాత సుఖీభవ’ పథకం వర్తింపజేస్తున్నారు. భూమి అమ్మిన రైతుకూ పథకం వర్తించడం లేదు. పోనీ భూమిని కొని కొత్తగా పట్టాదార్‌ పాస్‌ పుస్తకం చేయించుకున్న రైతులకై నా వర్తించిందా అంటే అదీ లేదు. భూమి ఉన్న తల్లి లేదా తండ్రి కానీ మృతి చెందితే సదరు భూమిని రాయించుకున్న కుమారునికి గానీ, కూతురుకు గానీ అన్నదాత సుఖీభవ వర్తింపజేయడం లేదు. ఫలితంగా జిల్లాలోని 2,65,040 మంది రైతులు మాత్రమే సుఖీభవకు అర్హత సాధించారు.

కౌలు రైతులకు మొండిచేయి..

వైఎస్‌ జగన్‌ హయాంలో కౌలు రైతులు, దేవదాయ శాఖ భూములు సాగుచేసుకునే రైతులకూ రైతు భరోసా లబ్ధి చేకూరింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న వారికి, ఇతరుల వద్ద భూములు కౌలుకు తీసుకుని సాగుచేసుకుంటున్న వారికి మొండిచేయి చూపింది. దీంతో సుమారు 20 వేల మంది రైతులకు పథకం లబ్ధి చేకూరలేదు.

ఇక పీఎం కిసాన్‌లోనూ వేలాది మందికి అన్యాయం జరిగింది. 2019 ఫిబ్రవరి తర్వాత కొత్తగా ఎక్కిన రైతులకు పీఎం కిసాన్‌ పథకాన్ని వర్తింపజేయలేదు. ఫలితంగా జిల్లా నుంచి 2,46,262 మందికి మాత్రమే పీఎం కిసాన్‌ వర్తింపజేయగా... సుమారు 40 వేల మందికిపైగా రైతులకు ఈ పథకం వర్తించలేదని జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య పేర్కొన్నారు. ఇక సిమ్‌ కార్డు ఇబ్బందులతో ఫోన్‌ నంబర్‌ మార్చిన రైతులకు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఆర్‌ఎస్‌కే సిబ్బంది ఫోన్‌ చేసినప్పుడు పాస్‌ వర్డ్‌ చెప్పని రైతులకు పథకం వర్తించలేదు. ఇలా వేలాది మంది రైతులకు మొండి చేయి చూపారు.

గతంలో ఠంచనుగా పెట్టుబడిసాయం..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్‌–రైతు భరోసా కింద ఏటా రూ.13,500 ప్రకారం ఖరీఫ్‌కు అనుకూలంగా జూన్‌, రబీకి అక్టోబర్‌, పంటకోతలు జరిగే సంక్రాంతికి ఇలా... మూడు విడతల్లో క్రమం తప్పకుండా క్యాలెండర్‌ ప్రకారం పెట్టుబడిసాయం అందిస్తూ వచ్చారు. అలాగే ఐదేళ్ల కాలంలో ప్రతి రైతుకూ రూ.67,500 ప్రకారం భరోసా కల్పించారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కౌలు రైతులు, దేవదాయ, అటవీభూమి సాగుదారుల కింద 2 వేల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో రూ.13,500 ప్రకారం సాయం చేసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతుల గురించి పట్టించుకోకపోవడంతో వారికి పైసా కూడా సాయం అందే పరిస్థితి లేదు. కౌలు కార్డులు కూడా అందించకుండా మోసం చేయడంతో కౌలు రైతుల కష్టాలు మరింత పెరిగాయి.

రైతు పరిస్థితి దయనీయం..

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇన్‌పుట్‌సబ్సిడీ ఊసే లేదు, ఇన్సూరెన్స్‌ గల్లంతైపోయింది. యంత్ర పరికరాలు లేవు. విత్తనాలు, ఎరువుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఆత్మహత్యలకు ఎక్స్‌గ్రేషియా లేదు. మద్దతు ధరల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అటు వ్యవసాయం, ఇటు ఉద్యానం.. రెండూ సంక్షోభంలో కూరుకుపోతున్నా చంద్రబాబు సర్కారు ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది.

‘అన్నదాత దుఃఖీభవ’

తొలిఏడాది జిల్లా రైతులకు

చంద్రబాబు ఎగనామం

రెండో ఏడాది అమలు చేసినా

కొర్రీలతో జాబితాలో కోతలు

జిల్లాలో సుమారు 20 వేల మంది

రైతులకు అందని పెట్టుబడి సాయం

కౌలు రైతుల కష్టాలు పట్టించుకోని

చంద్రబాబు ప్రభుత్వం

ఇన్‌పుట్‌, ఇన్సూరెన్స్‌, ఎక్స్‌గ్రేషియా ఊసే ఎత్తని వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement