ప్రశాంతి నిలయం: ప్రముఖ కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఘనంగా నిర్వహించారు. ముందుగా జేసీ మౌర్య భరద్వాజ్ మొల్లమాంబ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... సామాన్య కుటుంబంలో పుట్టి మొల్లమాంబ రామాయణాన్ని రచించి కీర్తిని గడించారన్నారు. సాహితీ రంగంలో తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్నారన్నారు. ఆమె రచనలు తెలుగు భాషా సాహిత్యానికి అమూల్యమైనవన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, ఎస్‌డీసీ సూర్యనారాయణరెడ్డి, కుమ్మర సంఘం నాయకులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
‘పురం’లో
రేపు మెగా జాబ్ మేళా
పుట్టపర్తి టౌన్: నైపుణ్యాభివద్ధి సంస్థ, సీడాప్, సీఐఇల్ సంస్థ ఆధ్వర్యలో 15న హిందూపురం పట్టణంలో సప్తగిరి డిగ్రీ కళాశాలలో వంద జాతీయ బహుళ జాతీయ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ, సిడాప్ కోఆర్డినేటర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. హిందూపురంలోని సప్తగిరి డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటలకు మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని, మెగా జాబ్ మేళాకు హాజరయ్యే వారు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ డిప్లమా, డిగ్రీ, బీటెక్, పీజీ. బీఫార్మసీ, ఎం ఫార్మసీ చదివిన వారు అర్హులన్నారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ 15 వేల నుంచి రూ 50 వేల జీతం ఉంటుందన్నారు. అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు జిరాక్స్, ఆధార్‌కార్డ్, రెండు పాస్ ఫోటోలు తీసుకరావాలన్నారు. వివరాలకు 9966682246, 9676706976, 9398643930 సెల్ నంబర్లను సంప్రదించాలన్నారు.
భౌతికశాస్త్రం పరీక్షకు
117 మంది గైర్హాజరు
పుట్టపర్తి: జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం 41 కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు భౌతిక శాస్త్రం పరీక్ష నిర్వహించారు. 6,513 మందికి గాను 6,396 మంది పరీక్షకు హాజరు కాగా, 117 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్య జిల్లా అధికారి (డీఐఈఓ) చెన్న కేశవప్రసాద్ తెలిపారు. విద్యాశాఖ అధికారులు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
అడవుల పరిరక్షణకు
సిట్ బృందాలు
ప్రశాంతి నిలయం: జిల్లాలోని అడవులను పరిరక్షించడానికి జిల్లా స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాలను (సిట్) ఏర్పాటు చేసినట్లు జేసీ మౌర్యభరద్వాజ్, అటవీశాఖ జిల్లా అధికారి చక్రపాణి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అడవుల పరిరక్షణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిట్ బృందాలతో పాటు రెవెన్యూ డివిజన్‌ల వారీగా బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో రిజర్వ్ అడవులుగా నమోదైన రెవెన్యూ భూముల గుర్తింపు, ల్యాండ్ బ్యాంక్ కోసం వ్యవసాయానికి అనువుగా లేని అడవుల మాదిరి కనిపించే భూములను గుర్తించడం తదితర వాటిపై చర్చించామన్నారు.


