విద్యుత్‌ అంతరాయంౖపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ అంతరాయంౖపై ఆందోళన

Mar 14 2026 7:24 AM | Updated on Mar 14 2026 7:24 AM

హిందూపురం: అప్రకటిత కరెంటు కోతలపై రైతన్నలు కన్నెర్ర చేశారు. కీలకమైన సమయంలో ఎడాపెడా విద్యుత్‌ సరఫరాలో కోతలు విధిస్తూ పంటలకు సాగునీరు అందకుండా చేస్తున్న విద్యుత్‌శాఖ అధికారుల వైఖరిని నిరసిస్తూ శుక్రవారం మణేసముద్రం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ...గరిష్ట ఉష్ణోగ్రతలతో ఇప్పటికే బోర్లలోని నీటిమట్టం తగ్గుతోందని, అయినా ఎలాగోలా పంటలను కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. అయితే ఇటీవల విద్యుత్‌ అధికారులు ఇష్టానుసారం సరఫరా నిలిపివేస్తున్నారని, దీంతో బోర్లు ఆడక పంటలు ఎండుముఖం పట్టాయని వాపోయారు. ఇదే విషయాన్ని స్థానిక విద్యుత్‌ అఽధికారులకు విన్నవిస్తే... తామేం చేయలేమని, సబ్‌స్టేషన్‌ నుంచి నిలిపి వేస్తున్నారని చెబుతున్నారన్నారు. సబ్‌స్టేషన్‌కు వచ్చి తమ సమస్య చెబితే మెయిన్‌లైన్‌ నుంచి కోత వస్తోందని ఎవరికి వారు తప్పించుకుంటున్నారన్నారు. అందువల్లే రాస్తారోకో చేయాల్సి వచ్చిందన్నారు. తమకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తామని విద్యుత్‌ ఉన్నతాధికారులు హామీ ఇచ్చే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. రైతుల రాస్తారోకోతో పెనుకొండ, అనంతపురం మార్గంలో నడిచే వాహనాలు రోడ్డుపైనే భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో మణేసముద్రం గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

మణేసముద్రం సబ్‌స్టేషన్‌ ఎదుట

రాస్తారోకో చేసిన రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement